ఉపాధ్యాయుడి నిర్వాకం...విద్యార్థికి విద్యుత్ షాక్
ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థికి విద్యుత్ షాక్ తగిలిన ఉదంతం ఇది.
దిశ, కేసముద్రం : ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థికి విద్యుత్ షాక్ తగిలిన ఉదంతం ఇది. కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం విద్యార్థికి విద్యుత్ షాక్ తగిలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండాకు చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు కల్వల హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 9వ తరగతి విద్యార్థులందరూ పీఈటీ రాజేందర్ సమక్షంలో ఆటలాడుతున్నారు. ఈ క్రమంలో ఓ వాహనంలో మొరం నింపుకొని పాఠశాల గేటు వద్దకు వచ్చింది.
పైన కరెంటు వైర్లు ఉన్నాయని, వాహనం లోపలికి పోదని వాటిని పక్కకు తీయాలని విద్యార్థికి అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు పవన్ బాలుడికి సూచించాడు. దీంతో బాలుడు డైరెక్ట్ గా కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. వైర్లు తాకడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు. హుటాహుటిన పక్కనే ఉన్న పీహెచ్సీకి బాలుడిని తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.