విషాదం..వరకట్న వేధింపులతో గర్భిణీ మృతి..

వరకట్న వేధింపులు తాళలేక ఓ నిండు గర్భిణీ పురుగుల మందు తాగి

Update: 2024-09-20 14:45 GMT

దిశ, దుగ్గొండి: వరకట్న వేధింపులు తాళలేక ఓ నిండు గర్భిణీ పురుగుల మందు తాగి మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముదురు కోళ్ల సందీప్, దేశాయిపల్లికి చెందిన పొదురు కోళ్ల ప్రవళిక(22). మూడేళ్ళ కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా పెళ్ళైన దగ్గర నుండి ప్రవళిక ను కట్నం తేవాలనే వేధింపులు మొదలైనట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రూ.10 లక్షల కట్నం, రెండు ఎకరాల భూమి తీసుకురావాలని ఆమె భర్త సందీప్, అత్త విజయ నిత్యం ప్రవళికను మానసికంగా వేధిస్తూ ఇబ్బందికి గురి చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో మూడు నాలుగు సార్లు పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. 8 నెలల గర్భవతి అయిన ప్రవళికను నెల కిందట పుట్టింట్లో వదిలేసి వెళ్తూ కట్నం తోనే రావాలని తెగేసి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటిన వరంగల్ లోని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Similar News