Kidnap : బాన్సువాడలో పోస్టుమాస్టర్ కిడ్నాప్ కలకలం..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం పోస్టుమాస్టర్ సాయినాథ్ కిడ్నాప్ కలకలం రేపింది.

Update: 2024-08-06 09:32 GMT
Kidnap : బాన్సువాడలో పోస్టుమాస్టర్ కిడ్నాప్ కలకలం..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం పోస్టుమాస్టర్ సాయినాథ్ కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ కు గురైన సాయినాథ్ భార్య రామలక్ష్మి కిడ్నాప్ విషయమై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో పోస్టుమాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న సాయినాథ్ అనే వ్యక్తి బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో తన భార్య రామలక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం నలుగురు వ్యక్తులు సాయినాథ్ ఇంటికి వచ్చి ఇంటి బయట నుండి సాయినాథ్ ను పేరు పెట్టి బయటికి రమ్మని పిలిచారు. దాంతో సాయినాథ్ బయటికి వచ్చి చూశారు.

మీతో మాట్లాడేది ఉందని, సాయినాథ్ భుజం పై చేయి వేసి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి నుంచి తీసుకెళ్లారు. తన భర్త కోసం వచ్చిన వ్యక్తులను తానెప్పుడూ చూడలేదని, తన భర్త కూడా వచ్చిన వ్యక్తులు ఎవరో తెలియదని చెప్పింది. తనకు అనుమానం వచ్చి వారి వెంటనే తన భర్తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ వారి వెనకే కొంత దూరం నడిచాను అన్నారు. రేషన్ షాప్ ముందర ఆగి ఉన్న కారులో తన భర్తను ఎక్కించుకొని కారులో వెళ్లిపోయారని రామలక్ష్మి తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను ఎక్కడికి తీసుకుపోయారనే భయంతో తన బంధువులకు, తెలిసినవారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చానన్నారు. తన భర్తకు ఎవరితోనో శత్రుత్వం లేదని ఆమె తెలిపారు.

ఈ విషయం పై స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టుమాస్టర్ కిడ్నాప్ సంఘటన బాన్సువాడలో ఒక్కసారిగా కలకలం రేపింది. సాయినాథ్, రామలక్ష్మి దంపతులకు పిల్లలు లేరని తెలిసింది. కిడ్నాప్ కారణం కుటుంబ కలహాలా, మరింకేదైనా కారణమై ఉంటుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News