AP: ఓటు అమ్ముకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు

5వేల రూపాయలకు తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఓ పోలీసు అధికారి సస్పెండయ్యారు.

Update: 2024-05-20 03:23 GMT

దిశ,వెబ్‌డెస్క్:5వేల రూపాయలకు తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఓ పోలీసు అధికారి సస్పెండయ్యారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజా బాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే, ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు పుచ్చుకున్నారు. ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో బదిలీ చేసినట్లు సమాచారం.

మరోవైపు, ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు విచారించగా ఎస్సైకి డబ్బులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాజాబాబు డబ్బులను ఎస్సై బంధువులకు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు వారిని విచారించారు. అనంతరం ఎస్సైపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. దీంతో, ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News