దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని...
దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారం వస్తుందని ఒక వ్యక్తిని మభ్యపెట్టి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ లో జరిగింది.
దిశ,ఉప్పల్ : దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారం వస్తుందని ఒక వ్యక్తిని మభ్యపెట్టి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ లో జరిగింది. డీఎస్ఐ రఘురాము తెలిపిన వివరాలు ప్రకారం సరూర్ నగర్ కు చెందిన తాపీ నరేందర్ డాక్టర్స్ కాలనీలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. అతని వద్ద వంట మాస్టర్ గా బొడ్డు ఓంకార్ అనే వ్యక్తి చేరాడు. మేస్త్రీ పని చేసే వాసు అనే వ్యక్తిని తన యజమానికి పరిచయం చేసి దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు వస్తున్నాయని మొదట శాంపిల్ గా అరతులం బంగారాన్ని ఇచ్చి నమ్మించారు.
ఒరిజినల్ బంగారం అని నమ్మిన నరేందర్ పర్సనల్ లోన్ తీసుకుని మరీ ఉప్పల్ లోని శిల్పారామం సమీపంలో నిందితులకు 8 లక్షల 95 వేల రూపాయలు ఇచ్చి రెండు బంగారు బిస్కట్ లను తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బంగారు బిస్కట్ లను చెక్ చేయగా బంగారు కలర్ వేసిన ఫేక్ గోల్డ్ బిస్కెట్లని తేలాయి. దీంతో వారిని సంప్రదించగా ఫోన్ స్విచ్చాప్ రావడంతో గత నెల తొమ్మిదవ తారీకున సరూర్‌నగర్ పోలీసులను బాధితుడు నరేందర్ ఆశ్రయించాడు. జరిగిన సంఘటనా ఉప్పల్ పీఎస్ కావడంతో గత నెల ఇరవై అయిదున కేసును ఉప్పల్ పీఎస్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి , ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రైం ఎస్ఐ రఘురామ్ సదరు కేసును చేధించి నిందితులు ఓంకార్,వాసులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నకిలీ బంగారం బిస్కెట్లు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్ఐ రఘురామ్ తెలిపారు.