ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం: ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
ముంబై పోలీసులు రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నైజీరియా దేశానికి చెందిన పౌరులను అరెస్టు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై పోలీసులు రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని.. ఇద్దరు నైజీరియా దేశానికి చెందిన పౌరులను అరెస్టు చేశారు. సాకీ విహార్ రోడ్డులోని హంసా ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు సకినాక పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని విచారించారు. అనంతరం వారి బ్యాగులో తనిఖీలు చేపట్టగా.. 880 గ్రాముల కొకైన్‌తో కూడిన 88క్యాప్సూల్స్ పట్టుబడ్డాయి. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 9 కోట్లు ఉంటుందని వెల్లడించారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్1985 (ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ ఎవరికి సరఫరా చేసేందుకు వెళ్తున్నారో..తెలుసుకునేందుకు విచారణ మొదలు పెట్టారు.