విద్యుదాఘాతంతో రైతు మృతి
కోతుల బెడద నుండి తప్పించుకోడానికి పక్క చేనులో వేసిన విద్యుత్ తీగ కాలుకు తాకి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం కొత్తూరుతండాలో శుక్రవారం చోటుచేసుకుంది.
దిశ, కారేపల్లి : కోతుల బెడద నుండి తప్పించుకోడానికి పక్క చేనులో వేసిన విద్యుత్ తీగ కాలుకు తాకి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం కొత్తూరుతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తూరుతండాకు చెందిన రైతు దారావత్ హతీరాం(41) పత్తి చేనులో నీరు పెట్టడానికి వెళ్లాడు. ఈయన చేను పక్కనే ఉన్న మరో రైతు తన పంట రక్షణకోసం కోతులు రాకుండా జీ వైరు అమర్చి దానికి విద్యుత్ ప్రసరణ చేశాడు.
చేనులో పనులు నిర్వహిస్తున్న హతీరాం కోతులను తరుముతూ విద్యుత్ వైరుకు తగిలాడు. దాంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. చేనుకు వెళ్లిన హతీరాం ఇంటికి రాకపోవడంతో భార్య నాగమణి భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తక పోవడంతో ఆమె కుటుంబ సభ్యులను తీసుకొని చేను వద్దకు వెళ్లగా మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య నాగమణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.