టపాసులు తయారు చేస్తుండగా పేలుడు
పాతబస్తీలోని ఓ ఇంట్లో అక్రమంగా టపాసులు తయారు చేస్తుండగా ఐదుగురికి గాయాలైన ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది.
దిశ, చార్మినార్ : పాతబస్తీలోని ఓ ఇంట్లో అక్రమంగా టపాసులు తయారు చేస్తుండగా ఐదుగురికి గాయాలైన ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. బహదూర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... పాతబస్తీ బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ కాశీబుగ్గ దేవాలయం సమీప ప్రాంతంలో ఆరు నెలల క్రితం షకీరా బేగం(55), హఫీజ్ దంపతులు ఇల్లు కొనుగోలు చేశారు. వీరికి సమీనా బేగం (27), మొహమ్మద్ వసీమ్(29) సంతానం. అయితే సమీనా బేగం ఇద్దరు పిల్లలు కూడా షకీరాబేగం వద్దనే ఉంటున్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కిందకు నేలకు కొట్టే లైసెన్స్ టాపాసులు ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆ టపాసులకు కావాల్సిన కెమికల్స్, గులకరాళ్లు నిలువ ఉంచుకున్నారు.
కాగా గత కొంత కాలంగా తయారు చేసిన టపాసులు కూడా పెద్ద మొత్తంలోనే నిలువ ఉన్నాయి. దీంతో బుధవారం సాయంత్రం టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా అవి పేలాయి. ఇంటి రేకులు , గృహోపకరణ వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పక్కింటికి చెందిన అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. గ్యాస్ సిలిండర్ లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో షకీరా బేగం, సమీనా బేగంకు తీవ్రగాయాలయ్యాయి. హఫీజ్, వసీమ్‌లతో పాటు మరో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బహదూర్‌పురా పోలీసులు హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును బహదూర్‌పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.