కోటి రూపాయల గంజాయి సీజ్.. ఎలా తరలిస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సందే!

నర్సరీ మొక్కల చాటున గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను బాలానగర్​జోన్ ఎస్వోటీ అధికారులు జీడిమెట్ల పోలీసులతో కలిసి అరెస్టు చేశారు.

Update: 2023-12-16 15:10 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నర్సరీ మొక్కల చాటున గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను బాలానగర్​జోన్ ఎస్వోటీ అధికారులు జీడిమెట్ల పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40‌‌0 కిలోల గంజాయితోపాటు లారీ, రెండు మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్​డీసీపీ టీ.శ్రీనివాస్​రావు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్​రాష్ర్టం ఇండోర్​సమీపంలోని తీన్ ఇమ్లీ నివాసి బబ్లూ ఖరే (23), అమరావతి జిల్లా కల్పి గ్రామ వాస్తవ్యుడు గోవింద్​పాటిదార్ (42) వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం బబ్లూ రూ.2.5‌‌‌‌0 లక్షలను డౌన్ పేమెంట్‌గా చెల్లించి ఫైనాన్స్​ద్వారా ఓ లారీని కొనుగోలు చేశాడు.

దీనిని తన స్నేహితుడు రామచంద్ర కృష్ణ పేరున రిజిస్ర్టేషన్​చేయించాడు. ప్రతి నెలా రూ.33 వేలను ఫైనాన్స్ చేసిన సంస్థకు ఈఎంఐ కడుతున్నాడు. తాను లారీ నడపటంతోపాటు రెండో డ్రైవర్‌గా గోవింద్‌ను పెట్టుకున్నాడు. లారీని ఇండోర్‌లోని గుజరాత్​క్యారియర్స్​ట్రాన్స్​పోర్టులో పెట్టిన బబ్లూ, గోవింద్‌తో కలిసి ఎక్కువగా సరుకులను రాజమండ్రి, ఒడిషాలకు చేరవేసేవాడు. కాగా, దీంట్లో ఆశించిన ఆదాయం రాకపోవటంతో ఇద్దరు కలిసి గంజాయి స్మగ్లింగ్​చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే వీరికి ఒడిషాకు చెందిన బబ్లూ పరిచయం అయ్యాడు. తాను ఎంత కావాలంటే అంత గంజాయి సమకూరుస్తానని, దానిని తీసుకెళ్లి లాతూర్‌కు చెందిన అరవింద్‌కు ఇవ్వాలని ఇద్దరితో చెప్పాడు.

ఇలా చేస్తే పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తానన్నాడు. దాంతో బబ్లూ, గోవింద్‌లు దీనికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో సీ.బబ్లూ ఇద్దరికి లారీ రిపేరింగ్​నిమిత్తం రూ.75 వేలను ఇచ్చాడు. ఆ డబ్బుతో బబ్లూ, గోవింద్‌లు లారీకి మరమ్మత్తులు జరిపించిన తరువాత రాజమండ్రి శివార్లకు వారిని లారీతో సహా పిలిపించాడు. అక్కడ 400 కిలోల గంజాయి ప్యాకెట్లను లారీలోకి లోడ్​చేయించి అవి కనబడకుండా నర్సరీ మొక్కలు పెట్టించాడు. అరవింద్​సంగారెడ్డిలో కలుస్తాడని, అతన్ని వెంటబెట్టుకుని లాతూర్​వెళ్లాలని సూచించాడు. ఈ క్రమంలో బబ్లూ, గోవింద్‌లు గంజాయి లోడ్‌తో ఉన్న లారీని తీసుకుని రాజమండ్రి నుంచి హైదరాబాద్​మీదుగా సంగారెడ్డికి బయల్దేరారు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందటంతో బాలానగర్​జోన్​ఎస్వోటీ అధికారులు జీడిమెట్ల పోలీసులతో కలిసి నిందితులను పట్టుకోవటానికి పకడ్భంధీగా వ్యూహం పన్నారు. శుక్రవారం సాయంత్రం గంజాయి లోడ్‌తో వెళుతున్న లారీని జీడిమెట్ల ప్రాంతంలో పట్టుకున్నారు. బబ్లూ, గోవింద్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బబ్లూ, అరవింద్‌ల కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News