అప్పు తీసుకున్నవారే వృద్దురాలి పాలిట యమకింకరులయ్యారు..
నేటి సమాజంలో రోజురోజుకు మానవత్వం మంట కలిసి పోతుంది.. ఆపద సమయంలో అయ్యోపాపం అని అప్పు ఇచ్చి ఆదుకుంటే ఆఖరికి తన ప్రాణాల మీదకే వచ్చింది.
దిశ, నార్కట్ పల్లి : నేటి సమాజంలో రోజురోజుకు మానవత్వం మంట కలిసి పోతుంది.. ఆపద సమయంలో అయ్యోపాపం అని అప్పు ఇచ్చి ఆదుకుంటే ఆఖరికి తన ప్రాణాల మీదకే వచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే వృద్ధురాలిని హత్య చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మకు అవసరాల నిమిత్తం లక్ష రూపాయలను అప్పుగా ఇచ్చింది.
తిరిగి ఇవ్వమని పదే పదే పలుమార్లు అడిగింది. దీంతో అప్పు తీసుకున్న రంగమ్మ తన కుమారుడు కొలను కార్తీక్ కు ఈ విషయం చెప్పింది. కార్తీక్ గురువారం రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. శుక్రవారం జానకమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు ఎంత పిలిచినా పలకట్లేదని తలుపులు తెరిచి చూడగా కార్తీక్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటి పై ఉన్న పది తులాల బంగారాన్ని సైతం ఎత్తుకెళ్లాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.