ATM మిషన్‌ను పగలగొట్టి రూ. 20 లక్షల నగదు చోరీ..

చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండల కేంద్రంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరిగింది.

Update: 2024-07-07 13:18 GMT

దిశ ప్రతినిధి, చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండల కేంద్రంలో ఉన్న ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి అందులో ఉండిన రూ. 20 లక్షల నగదును తీసుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గుడిపాల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం ఉంది. గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోపలికి వెళ్లి మిషన్‌ను పగలగొట్టి అందులో ఉండిన నగదును తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత బ్యాంకు అధికారులు కూడా వచ్చి ఏటీఎం ను పరిశీలించి అందులో రూ. 20 లక్షల వరకు నగదు ఉన్నట్లు గుర్తించారు.

ATM ను పరిశీలించిన ఎస్పీ..

ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం గుడిపాలకు వెళ్లారు. చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి అక్కడున్న అలార్మింగ్ సిస్టం తదితరాలను అడిగి తెలుసుకున్నారు. చోరీ జరిగిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ తర్వాత చిత్తూరు డీఎస్పీతో పాటు స్థానిక పోలీసులతో చర్చించి నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Similar News