HYD: మైనర్‌పై ఓయోలో అత్యాచారం.. నిందితులు అరెస్ట్​

మాయ మాటలతో మైనర్​బాలికను ఓయో లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-11-17 14:11 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మాయ మాటలతో మైనర్​బాలికను ఓయో లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ తకత్​బౌలి ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ ఈనెల 14న గోల్కొండ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంట్లో అంతకుముందు రోజు తన 15 ఏళ్ల కూతురు రాత్రి 7గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లిందని పేర్కొంది. భర్తతో కలిసి ఎంత వెతికినా కూతురి ఆచూకీ లభించలేదని తెలిపింది. కాగా, 16వ తేదీ తెల్లవారుజాము 3గంటల సమయంలో చోటాబజార్​ప్రాంత నివాసి, వృత్తిరీత్యా బైక్​మెకానిక్​అయిన సయ్యద్​నజీరుద్దీన్​ఎలియాస్​షోయబ్​(20) తన కూతురికి బైక్​పై తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టి పరారయ్యాడని తెలిపింది.

ఈ క్రమంలో పోలీసులు బాధితురాలిని విచారించగా వృత్తిరీత్యా ఎలక్ర్టీషియన్ అయిన తకత్​బౌలి నివాసి సయ్యద్​అబ్దుల్​నదీమ్​(23) తనను నజీరుద్దీన్ బైక్‌పై నెక్నాంపూర్‌లోని ఓయో లాడ్జీకి పిలిపించుకుని అక్కడ తనపై అత్యాచారం చేసినట్టుగా వెల్లడించింది. ఈ క్రమంలో గోల్కొండ పోలీసులు అబ్దుల్​నదీమ్, నజీరుద్దీన్‌లపై ఐపీసీ 363, 376(3) రెడ్​విత్​109, పోక్సో యాక్ట్​సెక్షన్​5 రెడ్​విత్​6, 17 ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరితోపాటు లాడ్జీలో వీరికి గది అద్దెకు ఇచ్చిన ఓయో లాడ్జీ రిసెప్షనిస్ట్​జాన్​సింగ్​(23), లాడ్జీ యజమాని ముంతా విజయ్​(30)లను కూడా కేసులో నిందితులుగా చేర్చారు. నిందితుల్లో అబ్దుల్​నదీమ్, షోయబ్‌లను ఈనెల 14న అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం జాన్​సింగ్, విజయ్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News