కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు పన్నాగం

కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి కడతేర్చే ప్రయత్నం చేసింది ఓ భార్య.

Update: 2024-09-20 15:20 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి కడతేర్చే ప్రయత్నం చేసింది ఓ భార్య. ఆ నేరం గుర్తు తెలియని దుండగులపైకి నెట్టింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండాలో చోటుచేసుకుంది. శుక్రవారం ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, స్థానిక ఎస్సై మల్లారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని బంజారా తండాకు చెందిన ధారావత్ నిర్మలకు ధారావత్ మోహన్ తో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ధారావత్ మోహన్ మానసిక రోగి. భర్తకు చికిత్స చేయించేందుకు వేలాది రూపాయలు ఖర్చు అయ్యేవి. దీనికి తోడు భార్యాభర్తల మధ్య దాంపత్య బంధం సరిగా లేకపోవడంతో నిర్మల మానసికంగా కృంగిపోయింది. ఈ క్రమంలో తన భర్తను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈనెల 17వ తేదీ రాత్రి తన కుమారుడిని వేరే గదిలో పడుకోబెట్టి భార్యాభర్తలు మరో గదిలో నిద్రించారు.

    అర్ధరాత్రి 2 గంటల సమయంలో లేచి మోహన్ మెడపై గొడ్డలితో రెండుసార్లు నరికింది. అనంతరం చనిపోయాడని భావించి గొడ్డలిని రేకుల షెడ్డులో దాచి పెట్టింది. రక్తం పడడంతో స్నానం చేసి వేరే దుస్తులు మార్చుకొని ఇంటి ముందర ఉన్న వినాయక మండపంలో ఉన్న యువకుల వద్దకు వెళ్లి ఇంట్లో దొంగలు చొరబడి తన భర్త మోహన్ ను చంపి ఇంట్లో ఉన్న బంగారం దోచుకెళ్లారని చెప్పింది. దీంతో యువకులు మోహన్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా అప్పుడే మోహన్ తన తలపై ఉన్న రక్తాన్ని కడుక్కొని బయటకు వస్తున్నాడు. దాంతో యువకులు మోహన్ ను వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తరలించారు.

     అనంతరం నిర్మల తమ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి తన భర్త మోహన్ పై దాడి చేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్, స్థానిక ఎస్సై మల్లారెడ్డి కలిసి డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. వేలిముద్రలు సేకరించి విచారణ నిర్వహించారు. దాంతో అసలు విషయం బయటపడింది. నిర్మల పరారీలో ఉండడంతో గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ గంగారాంను జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్ అభినందించి రివార్డ్ ను అందజేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Tags:    

Similar News