పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావడం లేదని జీవితం పై విసుగు చెంది వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలి గిద్ద గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, షాద్ నగర్ : పెళ్లి కావడం లేదని జీవితం పై విసుగు చెంది వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలి గిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. షాద్ నగర్ ఎస్సై బలరాం తెలిపిన వివరాల ప్రకారం కొందుర్గ్ మండలంలోని గంగన్న గూడ గ్రామానికి చెందిన గోవర్ధన్ చారి (28) వడ్ల పని చేసే వాడని, మద్యానికి బానిసై తనకు ఇంకా పెళ్లి కావడం లేదని తరచూ బాధపడేవాడని తెలిపారు.
తన అన్న వివాహం అయ్యాక గోవర్ధన్ వివాహం చేస్తానని తరచూ ఆయన తల్లి పుష్పమ్మ సర్ది చెప్పేదని, ఈ క్రమంలో రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం పనికి వెళ్తున్నా అని ఇంటి వద్ద చెప్పి వెళ్లి మొగిలిగిద్ద గ్రామశిరులోని పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతుడి తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బలరాం తెలిపారు.