దారుణం..అనుమానంతో భార్యను నరికి పరారైన భర్త
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో విచక్షణ రహితంగా నరికిన సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో మంగళవారం నెలకొంది.
దిశ ప్రతినిధి,చిత్తూరు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో విచక్షణ రహితంగా నరికిన సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో మంగళవారం నెలకొంది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పరిస్థితిని గుర్తించిన బాధితురాలి కుమార్తె ఎనిమిదేళ్ల చిన్నారి సమయస్ఫూర్తితో వ్యవహరించి 108కి ఫోన్ చేసి తన తల్లిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..చిత్తూరు నగర పరిధిలోని జానకార పల్లిలో కాపురమున్న ఉమాపతి బెంగళూరు-చెన్నై జాతీయ రహదారి పై యాదమరి మండల పరిధిలోని ముత్తరపల్లి బస్టాప్ వద్ద జెసీబీ మెకానిక్ షెడ్‌ను నడుపుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. గుడిపాల మండలం చీలపల్లికి చెందిన ఉమాపతికి జానకారపల్లికి చెందిన జ్యోతితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 12.40నిమిషాల సమయంలో ఇంటి వద్ద ఉన్న తన భార్యపై చికెన్ సెంటర్ లో ఉపయోగించే కసాయి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఇంటి బయట ఉన్న 8 ఏళ్ల కుమార్తె లోపలికి వచ్చి చూడగానే రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి ఏడ్చుకుంటూనే సమయస్ఫూర్తితో ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ ద్వారా 108కు సమాచారం ఇచ్చింది. దీంతో 108 సిబ్బంది హుటాహుటిన బాధితురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.