విషాదంగా మారిన విహారయాత్ర.. 21 మంది దుర్మరణం
సరదాగా విహార యాత్రకు బయలుదేరిన టూరిస్టులు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది టూరిస్టులు దుర్మరణం చెందారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సరదాగా విహార యాత్రకు బయలుదేరిన టూరిస్టులు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది టూరిస్టులు దుర్మరణం చెందారు. వెనిస్ నగరం సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది. మీథేన్ వాయువుతో నడిచే బస్సు కావడంతో వంతెనపై నుంచి కింద పడగానే బస్సులో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, విదేశీయులతో సహా మొత్తం 21 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 18 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వెనిస్ లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.