అయోధ్యకు మరింత పెరిగిన భక్తుల రద్ధీ.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు
అయోధ్య రామ మందిరంకు లక్షల సంఖ్యలో భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు..
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరంకు లక్షల సంఖ్యలో భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు. అయోధ్యకు వచ్చే అన్ని మార్గాల్లో వాహనాలను అధికారులు వెంటనే నిలిపివేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా రాముని దర్శనాన్ని తాత్కలికంగా అధికారులు నిలిపివేశారు. దీంతో ఆలయం గేటు బయట వేల కొద్ది బక్తులు గుమిగూడారు. అలాగే అయోధ్య నగర పరిసర ప్రాంతాల్లో కూడా తండోప తండాలుగా వచ్చి చేరారు. ఎక్కడ చూసినా రామ భక్తులతో అయోధ్య వీదులు నిండిపోయాయి. దీంతో ఆలయ, పరిసర ప్రాంతాల భద్రత ప్రమాదం లోకి వెళ్లింది.
అయోధ్య వైపు వెళుతున్న వాహనాలపై ఆంక్షలు
ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువగా భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. భారీ జనసందోహాన్ని చూసిన తర్వాత, అయోధ్యలో మరింత మంది యాత్రికుల రాకను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆలయం వెలుపల నుండి వచ్చిన విజువల్స్ శ్రీ రామ్ లల్లా యొక్క 'దర్శనం' కోసం చల్లని వాతావరణాన్ని తట్టుకుని భారీ సంఖ్యలో వేచి ఉన్న భక్తులను చూపించాయి. దీంతో పోలీసులు నగరంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో వాహనాలను నిలిపివేస్తున్నారు.
రామ భక్తులకు పోలీసులు విజ్ఞప్తి
ఒక్కసారిగా పెరిగిపోయిన భక్తుల తాకిడితో పోలీసులు మరింత బందోబస్తుతో రంగంలోకి దిగారు. అయోధ్య పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు భారీ బందోభస్తును ఏర్పాటు చేసినట్లు అయోధ్య ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్ధీ భారీగా ఉంది. కాబట్టి రామ భక్తులు దర్శనం కోసం తొందరపడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు రెండు వారాల తర్వాత అయోధ్యకు వచ్చే విధంగా షెడ్యూల్ చేసుకోవాలని తెలిపారు.
అయోధ్యలో భారీగా పోలీసుల మోహరింపు
రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రామాలయ ప్రాంగణంలో, చుట్టుపక్కల పోలీసులు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. మంగళవారం నాడు అయోధ్యలోని రామాలయంలో సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్నారు. అలాగే అదే సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. దీనికి తోడు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం అయోధ్య ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం సీసీ టీవీల ద్వార ప్రత్యేక పర్యవేక్షన నిర్వహిస్తున్నారు.