అంజనీ మాత ఒడిలో హనుమంతుడు.. ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా..

గత కొద్ది రోజులుగా అయోధ్యలోని రామమందిరం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-01-11 13:30 GMT

దిశ, పీచర్స్ : గత కొద్ది రోజులుగా అయోధ్యలోని రామమందిరం చర్చనీయాంశంగా మారింది. రాముడు, రామాయణం గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. రాముడి గురించి మాట్లాడితే హనుమంతుడి ప్రస్తావన లేకుండా ఉంటుందా.. తప్పకుండా ఉంటుంది. భారత దేశ వ్యాప్తంగా ఎన్నో హనుమాన్ మందిరాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో బజరంగబలి ఒక్కడే దర్శనం ఇస్తాడు. కానీ ఒక ఆలయంలో మాత్రం బాల హనుమాన్ అంజనీదేవి ఒడిలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని అంజన్‌ధామ్‌లో హనుమాన్ జన్మించాడని పురాణాలు, పండితులు చెబుతున్నారు. ఈ ధామ్ గుమ్లా జిల్లాలోని అంజన్ పర్వతం మీద ఉంది. ఇది సత్యయుగం, రామాయణ కాలానికి చెందింది. నేటికీ ఇక్కడ హనుమంతుడు బాలరూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయంలో హనుమంతుడు తన తల్లి ఒడిలో కూర్చుని ఉంటాడు. ఈ ఆలయం ఇప్పటికీ అంజన్ పర్వతం మీద గుహరూపంలో ఉంది.

ఇక్కడ బాలహనుమాన్ ను పూజిస్తారు..

హనుమంతుడిని భోలేనాథ్ 11వ రుద్రావతారంగా భావిస్తారని ఆలయ పూజారి చెబుతున్నారు. ఈ పర్వతం పైన ఉన్న ఈ గుహలో తల్లి అంజనీ హనుమంతుడికి జన్మనిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మాతా అంజనీ పేరు మీదుగా ఈ ప్రదేశానికి అంజన్ ధాం అని పేరు పెట్టారు. భారతదేశంలో హనుమంతుడు తన తల్లితో పాటు పిల్లాడి రూపంలో పూజలందుకునే మహావీర్ ఏకైక ఆలయం ఇది. హనుమంతుడు ఇక్కడే జన్మించాడని భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడి ప్రజలు తమను ఆయన వారసులుగా భావిస్తారు. ఈ ఆలయంలో అంజనీ మాత, హనుమంతునితో పాటు, రాముడు, లక్ష్మణుడు, సీత, రాధా కృష్ణ విగ్రహాలు, అనేక శివలింగాలు కూడా స్థాపించారు.

ఆ ప్రాంతమంతా శివలింగాల మయం..

అంజనీమాత గొప్ప శివ భక్తురాలు అని, ఆమె ప్రతిరోజూ శివుడిని పూజించేదని, ఆమె పూజించే విధానం కూడా ప్రత్యేకమైనదని పండితులు చెబుతారు. ఆమె సంవత్సరంలో 365 రోజులు వివిధ శివలింగాలను పూజించేదట. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. నేటికీ ఈ ప్రాంతంలో 365 శివలింగాలు, చెరువులు ఉన్నాయి. తులసీదాస్ రామచరిత మానస్ పుస్తకంలో కిష్కింధ సంఘటనలో అంజన్ పర్వతం గురించి ప్రస్తావించారని పండితులు చెబుతున్నారు.

అంజనీ గుహలో అంతుచిక్కని రహస్యాలు..

పూర్వం ఈ ప్రదేశంలో దాదాపు 1500 అడుగుల గుహ ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. తల్లి అంజనీమాత గుహలోపల ఏదో ఒక మార్గం ద్వారా ఖత్వా నదికి వెళ్లి స్నానం చేసి తిరిగి వచ్చేదని పురాణాలు చెబుతున్నాయి. కాలానుగుణంగా ఇదే గుహలో భక్తులు విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు నిర్వహించేవారట. అంజనీమాతను ప్రసన్నం చేసుకునేందుకు ఓ గిరిజనుడు గుహ వెలుపల మేకను బలి ఇచ్చాడని, దీంతో అంజనా మాత ఆగ్రహించి గుహ తలుపులు మూసేశారని చెబుతారు.

నాగదేవుని గుహ

అంజనీ గుహ కింద, సర్ప్ గుహ అని పిలిచే మరొక చిన్న గుహ ఉంది. నేటికీ ఈ గుహ ద్వారం వద్ద ఒక పాము కనిపిస్తుంది. ఈ పాము నాగ దేవుడు అని, అతని దర్శనం లేకుండా అంజనా ధామం దర్శన పుణ్యాన్ని పొందలేరని నమ్ముతారు.

రామనవమి నుండి మహావీర్ జయంతి వరకు జాతర

ఏడాది పొడవునా అంజనా ధామాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఉదయం పూట ఇక్కడ రద్దీ కనిపిస్తుంది. తల్లి అంజన, మహావీర్ దర్శనం కోసం వందల మంది ప్రజలు ఉదయాన్నే ఆలయానికి వస్తారని పండితులు చెబుతున్నారు. రామనవమి నుండి మహావీర్ జయంతి వరకు ఇక్కడ ఒక ప్రత్యేక జాతర నిర్వహిస్తారని, జార్ఖండ్ నుండి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని చెబుతున్నారు.

పంపా సరోవరం

రామాయణంలో పంప సరోవరం గురించి చాలా చోట్ల వర్ణించారు. పాల్కోట్ అంజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో పంప సరోవరం ఉంది. సుగ్రీవుని మంత్రిగా హనుమంతుడు ఉన్నప్పుడు నివసించిన పర్వతం పంపా సరోవరం పక్కన ఉన్న ఋషిముఖ పర్వతమని రామాయణంలో వివరించారు. సుగ్రీవుడు ఈ పర్వతం మీద శ్రీరాముని కలిశాడట. ఈ పర్వతం పై నిర్మించిన ఆలయం ఇప్పటికీ ఉందని చెబుతారు. అంజన్ ధామ్ కు వచ్చే భక్తులు ఖచ్చితంగా పంపా సరోవర్, రిషి ముఖ్ పర్వతాలను సందర్శిస్తారు.

Tags:    

Similar News