టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పోస్టుకు ఫస్ట్ రోజు 6 నామినేషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజునే 6 నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఈ 6 సెట్ల నామినేషన్లను పార్టీ కేంద్ర కార్యాలయంలో సమర్పించారు. పార్టీ ప్రధానకార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేసిన గంట వ్యవధిలోనే పోటా పోటీగా నామినేషన్లను దాఖలు చేయడం విశేషం. కేసీఆర్ పట్ల స్వామి భక్తిని చాటుకున్నారు. ప్రెసిడెంట్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రెసిడెంట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజునే 6 నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఈ 6 సెట్ల నామినేషన్లను పార్టీ కేంద్ర కార్యాలయంలో సమర్పించారు. పార్టీ ప్రధానకార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేసిన గంట వ్యవధిలోనే పోటా పోటీగా నామినేషన్లను దాఖలు చేయడం విశేషం. కేసీఆర్ పట్ల స్వామి భక్తిని చాటుకున్నారు. ప్రెసిడెంట్ పోస్టుకు ఇతర నేతలెవ్వరూ నామినేషన్లను దాఖలు చేసే అవకాశం లేనందున కేసీఆరే ఏక గ్రీవంగా ఎన్నిక కానున్నారు.
తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తితో కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 23న 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 24న సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 25న హైటెక్స్ లోని హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ సాధారణ సభ(ప్లీనరీ), అధ్యక్ష ఎన్నిక ఉంటుందని వెల్లడించారు.
కేసీఆర్ ను ప్రతిపాదించిన మంత్రులు, ఎంపీలు
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును మంత్రుల తరపున మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా మంత్రులంతా బలపర్చారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ సెట్ ను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
ఎంపీల తరపున రాజ్యసభ సభ్యుడు కేకే కేసీఆర్ ను ప్రతిపాదించగా ఎంపీలు రంజిత్ రెడ్డి, రాములు, బండ ప్రకాష్, వెంకటేష్ నేత, లక్ష్మీ కాంతారావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి బలపర్చారు. నామినేషన్ సెట్ అందజేశారు. అదే విధంగా కేసీఆర్ పేరును ఎమ్మెల్యేల తరపున లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి , కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, దానం నాగేందర్, మెతుకు ఆనంద్, రేఖా నాయక్, మాగంటి గోపీనాథ్ బలపర్చారు. ఎమ్మెల్యేల తరపున మరో సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్ రావు, పైళ్ల శైఖర్ రెడ్డి, నోముల భగత్, రవీంద్రకుమార్ బలపర్చారు.
ఎమ్మెల్సీల తరపున ఎమ్మెల్సీ భాను ప్రకాశ్ రావు అధ్యక్షుడిగా కేసీఆర్ ను ప్రతిపాదించగా ఎమ్మెల్సీలు కవిత, ఎమ్మెస్ ప్రభాకర్, శంభీపూర్ రాజు, భాను ప్రసాదరావు, నవీన్, సురభి వాణి దేవి, లక్ష్మీనారాయణ, దయానంద్, తెర చిన్నపరెడ్డి, దామోదర్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్ బలపర్చారు. అదేవిధంగా కేసీఆర్ ను రాష్ట్ర కార్యవర్గం తరపున టీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రతిపాదించగా ప్రధాన కార్యదర్శులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, వై. వెంకటేశ్వర్లు, బండి రమేష్, కార్యదర్శులు మెట్టు శ్రీనివాస్, కంచర్ల రామకృష్ణారెడ్డి, చాడా కిషన్ రెడ్డి, లింగంపల్లి కిషన్ రావు, యెడవెల్లి క్రిష్ణారెడ్డి, కోలేటి దామోదర్, మందుల సామేలు బలపర్చారు. నామినేషన్ సెట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
కోలాహలంగా తెలంగాణ భవన్
తెలంగాణ భవన్ కోలాహలంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ వేసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరలిరావడంతో భవనం వద్ద సందడి నెలకొంది. మొదటి సెట్ ను పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ను బలపరుస్తూ నామినేషన్ వేశారు. ఒక్క రోజే 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన మహిళా, రైతు, యువజన, దళిత సంఘాల నుంచి కూడా కేసీఆర్ ను బలపరుస్తూ మరికొన్ని నామినేషన్లను వేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.