గ్రేటర్ లో ఆమెకే అధికం..!
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మహిళలు గ్రేటర్ మహారాణులయ్యేందుకు పోటీ పడుతున్నారు. బల్దియా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శ్రమిస్తున్నారు. వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే అన్నట్లుగా.. రాజకీయ భవిష్యత్తుకు జీహెచ్ఎంసీ ఎన్నికలతో తొలి అడుగు వేసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికలను అవకాశంగా మలచుకొని పలువురు మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు ముందుకొచ్చారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఆమె హవా స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ల కంటే అధికం.. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, స్థానిక […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మహిళలు గ్రేటర్ మహారాణులయ్యేందుకు పోటీ పడుతున్నారు. బల్దియా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శ్రమిస్తున్నారు. వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే అన్నట్లుగా.. రాజకీయ భవిష్యత్తుకు జీహెచ్ఎంసీ ఎన్నికలతో తొలి అడుగు వేసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికలను అవకాశంగా మలచుకొని పలువురు మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు ముందుకొచ్చారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఆమె హవా స్పష్టంగా కనిపిస్తోంది.
రిజర్వేషన్ల కంటే అధికం..
జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లను వర్తింపజేయడంతో పురుషులతో సమానంగా వారు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులుగానూ పలువురు మహిళలు పోటీ చేస్తున్నారు. ఈసారి బల్దియా ఎన్నికల్లో 1122మంది అభ్యర్థులు బరిలో నిలువగా, వీరిలో సగం మంది మహిళలు ఎన్నికల్లో తలపడుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం టీఆర్ఎస్ మాత్రమే 150 డివిజన్లలో పోటీ చేస్తుండగా 85 డివిజన్లలో మహిళలను పోటీలో నిలిపింది. పలు కారణాలతో నవాబ్ సాహెబ్ కుంటలో అభ్యర్థిని నిలపని బీజేపీ 149 స్థానాలకు 79 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ 146 స్థానాల్లో తలపడుతుండగా 73స్థానాల్లో మహిళలను నిలిపింది. కాగా, తలాబ్ చంచలం, బార్కస్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో పోటీ చేయడం లేదు. టీడీపీ 106 స్థానాల్లో తలపడగా, మజ్లీస్ 51మందిని పోటీలో నిలిపింది.
పురుషుల స్థానాల్లోనూ…
మహిళలకు 50శాతం రిజర్వేషన్లు దక్కడంతో చాలా చోట్ల పోటీ చేసుందుకు అవకాశం కలిగింది. దీంతో నేతలు తమ సతీమణులను, కూతుళ్లను, కుటుంబ సభ్యులను పోటీలో నిలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ తాను గతంలో పోటీ చేసిన చర్లపల్లి డివిజన్(3) లో పురుషులకు రిజర్వేషన్ కల్పించినా తన భార్య బొంతు శ్రీదేవిని పోటీలో నిలిపాడు. అదేవిధంగా పాత బోయిన్ పల్లి డివిజన్ జనరల్ కు కేటాయించినప్పటికీ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగరి తన కుమార్తె అమూల్యను బరిలో నిలిపారు. ఇలా గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో పురుషులకు కేటాయించిన స్థానాల్లో మహిళలను బరిలో నిలిపారు.
కలిసొచ్చిన కులాంతర వివాహాలు..
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కులంతార వివాహం కూడా కలిచొచ్చింది. ఎస్సీ, ఎస్టీ మహిళలను వివాహం చేసుకున్న బీసీలు, ఓసీలు తమ సతీమణులను రిజర్వేషన్ స్థానాల్లో పోటీలో నిలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్ ఎస్సీ జనరల్ కు కేటాయించారు. అయితే టీఆర్ఎస్ నేత అనిల్ కిషోర్ గౌడ్ తన సతీమణి సబితను బరిలో నిలిపారు. గత ఎన్నికల్లోనూ సబితా ఇదే డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైంది. ఈ సారి కూడా టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
అదేవిధంగా ఎల్బీనగర్ హస్తినాపురం డివిజన్ ఎస్టీకి కేటాయించగా, ఈ డివిజన్ నుంచి శశిధర్ రెడ్డి సతీమణి సంగీత బరిలో నిలిచింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సంగీతను శశీధర్ రెడ్డి కులంతార వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ రెండు సీట్లలో కులంతార వివాహం చేసుకున్న బీసీ, ఓసీ సామాజిక వర్గానికి చెందిన కోడళ్లు ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇలా కులంతార వివాహం చేసుకున్న వారు సైతం గ్రేటర్ ఎన్నికల్లో పలువురు పోటీ చేస్తున్నారు.