‘ప్రేమాభిషేకం’.. ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం. ప్రేమాభిషేకం సినిమా చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే అపూర్వ విజయాన్ని అందుకుంది. తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీచిత్రంగా చరిత్రను సృష్టించింది. అంతకు ముందున్న ఇండస్ట్రీ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. చలనచిత్ర లోకంలో చరిత్ర సృష్టించిన చరిత్రాత్మక చిత్రంగా నిలిచింది. ప్రేమాభిషేకం… దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఓ కలికితురాయి. అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ ప్రధానపాత్రల్లో నటించిన ఓ ప్రేమపురాణం. ప్రేమికురాలి సుఖాన్ని కాంక్షించి ప్రేమికుడిగా ఓడిపోయేందుకు సిద్ధమైన ఓ […]

Update: 2020-02-18 02:41 GMT

ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం. ప్రేమాభిషేకం సినిమా చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే అపూర్వ విజయాన్ని అందుకుంది. తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీచిత్రంగా చరిత్రను సృష్టించింది. అంతకు ముందున్న ఇండస్ట్రీ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. చలనచిత్ర లోకంలో చరిత్ర సృష్టించిన చరిత్రాత్మక చిత్రంగా నిలిచింది.

ప్రేమాభిషేకం… దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఓ కలికితురాయి. అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ ప్రధానపాత్రల్లో నటించిన ఓ ప్రేమపురాణం. ప్రేమికురాలి సుఖాన్ని కాంక్షించి ప్రేమికుడిగా ఓడిపోయేందుకు సిద్ధమైన ఓ అపర ప్రేమికుడి కథ. ఆ త్యాగాన్ని అర్థం చేసుకుని భార్యగా ఒక్కరోజు బతికినా చాలని క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తిని చేసుకుని జీవితాన్నే త్యాగం చేసిన మరో ప్రేమికురాలి వ్యథ. దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగునాట ప్రభంజనమైంది. ప్రకంపనలు సృష్టించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని ఈ సినిమాను నిర్మించారు.

అనార్కలి, దేవదాసు, లైలా మజ్ను లాంటి కథలు చిత్ర రూపాన్ని ధరించి ఎంత ప్రజాధరణ పొందాయో అంతకు మించినస్థాయిలో ప్రేమాభిషేకం సినిమాకు నీరాజనాలు పలికారు సినీఅభిమానులు. సుదీర్ఘనటనానుభంతో పండి పక్షమై పరాకాష్టనందుకున్న అక్కినేని నటనావైదుప్యానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ప్రేమమూర్తిగా, త్యాగ మూర్తిగా పతాక సన్నివేశంలో ఆయన కనబరిచిన నటనకు ప్రేక్షకలోకం దాసోహమంది. ప్రధానపాత్రను ఇంత హృద్యంగా మలిచిన దర్శకులు దాసరి నారాయణరావు పనితనానికి సలాం చేసింది. దేవదాసు సినిమా తర్వాత ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటన అనన్యసామాన్యంగా ఉందనేది నిర్వివాద అంశం అని అప్పటి పత్రికలన్నీ అక్కినేని నటనాప్రతిభను ఆకాశానికెత్తాయి. కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం ఒక్కచేతి మీదుగా నడిపి పతాక సన్నివేశంతో కంటతడి పెట్టించిన దాసరి ప్రతిభకు పట్టంకట్టాయి. మహానటుడు, ప్రజాదర్శకుడు కలిసి ప్రజలపై కురిపించిన పూలాభిషేకం ‘ప్రేమాభిషేకం’ అంటూ కీర్తించాయి.

ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ప్రేమాభిషేకం సినిమాకు ఈ రోజు(మంగళవారం)తో 39 ఏళ్లు. తెలుగు సినిమా చరిత్రలో ప్రేమకావ్యంగా నిలిచిన ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతాలే, ఆణిముత్యాలే. చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలో…. ‘ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం..’, ‘నా కళ్లు చెబుతున్నాయి..’, ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా..’, ‘దేవీ మౌనమా.. శ్రీదేవి మౌనమా..’, ‘వందనం అభివందనం..’, ‘ఆగదు ఆగదు..’ పాటలు ఎవర్‌గ్రీన్ హిట్స్. ఇదిలా ఉంటే ఎనిమిది కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు జరుపుకున్న ఈ సినిమాకు తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా జై కొట్టింది. తమిళ్‌లో వఝే మాయమ్‌గా, హిందీలో ప్రేమ తపస్యగా రీమేక్ అయ్యాయి.

Tags:    

Similar News