ఆరేళ్లలో 326 సెడిషన్ కేసులు.. చార్జిషీట్ దాఖలైంది మాత్రం
న్యూఢిల్లీ: దేశంలో 2014 నుంచి 2019 కాలంలో మొత్తం 326 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇందులో 141 కేసుల్లోనే చార్జిషీట్ దాఖలైంది. అందులోనూ దోషులుగా తేలింది ఆరుగురే. ఇవి కేంద్ర హోం శాఖ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వివరాలు కావడం గమనార్హం. 2020 డేటాను హోం మినిస్ట్రీ ఇంకా మదింపు చేయలేదని అధికారులు తెలిపారు. ఈ కాలంలో అత్యధికంగా సెడిషన్ కేసులు (54) అసోంలో నమోదవ్వగా, 26 కేసుల్లో చార్జిషీట్ ఫైల్ అయింది. 25 కేసుల్లో విచారణ […]
న్యూఢిల్లీ: దేశంలో 2014 నుంచి 2019 కాలంలో మొత్తం 326 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇందులో 141 కేసుల్లోనే చార్జిషీట్ దాఖలైంది. అందులోనూ దోషులుగా తేలింది ఆరుగురే. ఇవి కేంద్ర హోం శాఖ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వివరాలు కావడం గమనార్హం. 2020 డేటాను హోం మినిస్ట్రీ ఇంకా మదింపు చేయలేదని అధికారులు తెలిపారు.
ఈ కాలంలో అత్యధికంగా సెడిషన్ కేసులు (54) అసోంలో నమోదవ్వగా, 26 కేసుల్లో చార్జిషీట్ ఫైల్ అయింది. 25 కేసుల్లో విచారణ పూర్తి కాగా, ఒక్కరూ దోషిగా తేలలేదు. జార్ఖండ్‌లో 40 సెడిషన్ కేసులు ఫైల్ అయ్యాయి. 16 కేసుల్లో విచారణ పూర్తవ్వగా, దోషిగా ఒక్కరు తేలారు. హర్యానాలో 31 కేసుల్లో ఒక్కరు దోషిగా తేలారు. బిహార్, జమ్ము కశ్మీర్, కేరళలో 25 చొప్పున సెడిషన్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో సెడిషన్ కేసులు నమోదు కాని రాష్ట్రాలు, యూటీలుగా మేఘాలయ, మిజోరం, త్రిపుర, సిక్కిం, అండమాన్ నికోబర్ దీవులు, లక్షదీవులు, పుదుచ్చేరి, ఛండీగడ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలు నిలిచాయి. స్వాతంత్ర్య సమరాన్ని అణచివేయడానికి మహాత్మాగాంధీ, తిలక్ వంటి సమరయోధులపై బ్రిటీష్‌వారు ప్రయోగించిన రాజద్రోహం సెక్షన్‌నూ 75ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ అమలు చేయాల్సిన అవసరముందా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రశ్నించిన సంగతి తెలిసిందే.