ICC World Cup 2023: 'ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు'

టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌‌కు వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో చోటుదక్కలేదు.

Update: 2023-09-21 15:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌‌కు వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో చోటుదక్కలేదు. దీంతో సెలక్టర్లను విమర్శిస్తూ సంజూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ స్పందించాడు. సంజూ తనకు అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాలని సూచించాడు. వన్డేల్లో సగటు 55 ఉన్నా సంజూ.. ఇప్పటికీ జట్టులో భాగం కాకపోవడం వింతగానే ఉంది. కానీ, భారత జట్టులో ఇప్పటికే ఇద్దరు వికెట్‌ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌ ఉండటంతో సంజూను ఎంపిక చేయలేదని నేను భావిస్తున్నా. ఇలా జరగడం వల్ల నిరుత్సాహపడతారని నాకు తెలుసు. కానీ, సంజూ తన అవకాశం కోసం వేచి చూడాలి.

కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లలో నేను రాహుల్ వైపు మొగ్గు చూపుతాను. అతను 4, 5వ స్థానాల్లో నిలకడగా ఆడుతున్నాడు. శాంసన్ కూడా మంచి ఆటగాడు, సిక్సర్లు కొట్టగలడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక జట్టులో ముగ్గురు వికెట్‌ కీపర్‌లను ఉంచలేం. వారందరికీ తుది జట్టులో చోటు కల్పించడం చాలా కష్టం’’ అని హర్భజన్‌ అభిప్రాయపడ్డాడు. టీమిండియా.. సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా జరగనుంది.


Similar News