ICC World Cup 2023: ఫ్యాన్స్‌కు పండగే.. టికెట్ల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ

వరల్డ్ కప్ మ్యాచుల టికెట్ల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారికి బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2023-09-07 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ మ్యాచుల టికెట్ల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారికి బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల 'బుక్‌ మై షో'లో వరల్డ్ కప్ టికెట్ల అమ్మకం మొదలైన సంగతి తెలిసిందే. అయితే భారత్ ఆడుతున్న మ్యాచ్‌ల టికెట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోయాయి. దానికితోడు బుకింగ్ సమయంలో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతసేపు వెయిట్ చేసినా కూడా టికెట్లు దొరకని వారే ఎక్కువ. దీంతో ఈ ఫ్యాన్స్ అందరూ కూడా బీసీసీఐపై మండిపడ్డారు. అన్ని టికెట్లు అమ్మకానికి పెట్టలేదని, చాలా తక్కువ టికెట్లే అమ్మారని ఆరోపణలు చేశారు. మిగతా టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసిన భారత్, పాక్ మ్యాచ్ టికెట్లు కూడా చాలా వేగంగా అయిపోయాయి.

ఇలాంటి కీలకమైన మ్యాచ్‌ల టికెట్లు త్వరగా అయిపోతాయని అంతా అనుకున్నారు. కానీ కనీసం బుకింగ్ చేసుకునే అవకాశం కూడా చాలా మందికి రాలేదు. ఈ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్.. భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించి కేవలం 8,500 టికెట్లు మాత్రమే అమ్మారని ఆరోపించారు. అహ్మదాబాద్ స్టేడియంలో లక్షమందికిపైగా ప్రేక్షకులు హాజరయ్యే వీలుంది. అలాంటిది కేవలం 8500 టికెట్లు మాత్రమే అమ్మడం ఏంటని నిలదీశారు. ఈ క్రమంలోనే అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించిన 4 లక్షల టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ కప్ టికెట్ల అమ్మకంలో తదుపరి దశలో ఈ 4 లక్షల టికెట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ టికెట్లు కూడా బుక్‌ మై షోలోనే దొరుకుతాయట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.


Similar News