ICC World Cup 2023: గాయాలున్నా ప్రపంచ కప్‌ జట్టులో.. ఆసీస్‌ బృందంలో 'ఆ నలుగురు'..

గాయాలతో బాధపడుతున్న ఆసీస్ ఆటగాళ్లు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.

Update: 2023-09-07 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: గాయాలతో బాధపడుతున్న ఆసీస్ ఆటగాళ్లు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులోకి ఈ నలుగురు ఎంపికయ్యారు. యాషెస్‌ సిరీస్‌లో మణికట్టుకు గాయాలైన కమిన్స్‌, స్మిత్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారు. గజ్జల్లో గాయంతో స్టార్క్‌.. చీలమండ నొప్పితో మ్యాక్స్‌వెల్‌ ఇబ్బంది పడుతున్నారు. అయితే నలుగురిలో కమిన్స్‌ మాత్రమే గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో ఆసీస్‌ జట్టులో ఉన్నాడు. అయితే అతను మ్యాచ్‌లు ఆడేది అనుమానమే.

‘‘రాబోయే వారాల్లో రేసులోకి రావడానికి ఆ నలుగురు సిద్ధంగా ఉన్నారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు వాళ్లు ఎంపికయ్యే అవకాశముంది. ప్రపంచ కప్‌కు జాతీయ జట్టును ప్రకటించడానికి ముందు దక్షిణాఫ్రికా, భారత్‌లో 8 వన్డేలు ఆడాల్సి ఉంది. అనంతరం ప్రపంచకప్‌లో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఉన్నాయి. టోర్నీ సన్నద్ధత కోసం కావాల్సినంత సమయముంది’’ అని సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ బెయిలీ తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టు:

కమిన్స్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, ఆష్టన్‌ అగర్‌, అలెక్స్‌ కేరీ, కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రేవిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, స్టార్క్‌, మార్కస్‌ స్టాయినిస్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా


Similar News