గోకుల్ చాట్ పేలుళ్లకు 14 ఏండ్లు.. నేటికీ జీవన్మరణ పోరాటమే
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని గోకుల్ చాట్ , లుంబినీ పార్క్ పేలుళ్లకు 14 ఏండ్లు నిండాయి. 2007 ఆగస్టు 25వ తేదీన కోఠి లోని గోకుల్ చాట్ వద్ద ముష్కర ముఠా జరిపిన పైశాచిక బాంబు దాడులలో 42 మంది విగతజీవులయ్యారు. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది అంగవైకల్యం బారిన పడి నేటికీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించేందుకు గాను ప్రతి సంవత్సరం […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : నగరంలోని గోకుల్ చాట్ , లుంబినీ పార్క్ పేలుళ్లకు 14 ఏండ్లు నిండాయి. 2007 ఆగస్టు 25వ తేదీన కోఠి లోని గోకుల్ చాట్ వద్ద ముష్కర ముఠా జరిపిన పైశాచిక బాంబు దాడులలో 42 మంది విగతజీవులయ్యారు. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది అంగవైకల్యం బారిన పడి నేటికీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించేందుకు గాను ప్రతి సంవత్సరం ఆగస్టు 25వ తేదీన గోకుల్ చాట్‌ను యాజమాన్యం మూసి వేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పేలుళ్ల దినాన్ని పురస్కరించుకుని గోకుల్ చాట్ ను మూసివేయగా పలువురు పేలుళ్ల బాధితులు గోకుల్ చాట్ వద్దకు చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు.
ఆస్తులన్నీ అమ్ముకుని వీధిన పడ్డా…
రహీం- గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల బాధితుడు
2007లో జరిగిన బాంబు పేలుళ్లలో గోకుల్ చాట్ వద్ద ఉన్న నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక కన్ను సైతం తొలగించారు. వైద్య చికిత్సల కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న నా ఆస్తులన్నీ అమ్ముకున్నాను. అప్పట్లో నగరంలో పెయింటర్‌గా పని చేసే నేను గోకుల్ చాట్ పేలుళ్లతో పని చేయలేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నాకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎన్ని మార్లు ఆదుకోవాలని మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇలా నాటి నుండి నేటి వరకు మిగిలిపోయిన ఆస్తులు అమ్మి రూ. 50 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించింది. అంతకుమించి ఎలాంటి సహాయం అందలేదు. ఇంటి అద్దె కూడా కట్టలేని, పూట గడవని దుస్థితిలో ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ మా విషయంలో ఒకసారి ఆలోచించాలి. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలి. బాంబు దాడులకు కారణమైన ఉగ్రవాదులు ఇంకా జైలులోనే ఉన్నారు. వారికి ఉరిశిక్ష విధించాలి. వారికి విధించే శిక్షలు భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పూనుకోవాలనుకునే వారికి గుణపాఠం కావాలన్నారు.