రాజ్‌భవన్‌లో కరోనా కలకలం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ పేదోడికైనా, పెద్దోళ్ళకైనా ఒకటే. మొన్న ప్రగతి భవన్‌లో కొద్దిమందికి పాజిటివ్ వస్తే ఇప్పుడు రాజ్‌భవన్‌లో సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. అందరితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, భర్త, కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కానీ వీరికి నెగెటివ్ వచ్చింది. నగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గవర్నర్ చొరవ తీసుకుని శనివారం, ఆదివారం రాజ్‌భవన్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ పేదోడికైనా, పెద్దోళ్ళకైనా ఒకటే. మొన్న ప్రగతి భవన్‌లో కొద్దిమందికి పాజిటివ్ వస్తే ఇప్పుడు రాజ్‌భవన్‌లో సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. అందరితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, భర్త, కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కానీ వీరికి నెగెటివ్ వచ్చింది. నగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గవర్నర్ చొరవ తీసుకుని శనివారం, ఆదివారం రాజ్‌భవన్ సిబ్బందికి కూడా పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 395మంది నుంచి శాంపిళ్ళను తీసుకుంటే అందులో 48మందికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన 347మంది శాంపిళ్ళు నెగెటివ్ వచ్చినట్లు రాజ్‌భవన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
రాజ్‌భవన్ భద్రతా విధుల్లో ఉన్న ప్రత్యేక బెటాలియన్‌లోని కొద్దిమంది పోలీసులకు ఆర్‌టీ-పీసీఆర్ విధానం ద్వారా చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో సిబ్బంది మొత్తానికి రాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయించినట్లు ఆ ప్రకటన స్పష్టం చేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో 28మంది పోలీసులు ఉన్నారని, పది మంది రాజ్‌భవన్ సిబ్బంది, మరో పదిమంది వారి కుటుంబసభ్యులు అని వివరించింది. పోలీసులను ఒక ఐసొలేషన్ కేంద్రానికి, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులైన ఇరవై మందిని ఎస్సార్ నగర్‌లోని ఆయుర్వేద ఆసుపత్రి ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు పేర్కొంది.
కంటైన్‌మెంట్ జోన్లు, రెడ్ జోన్లు, ప్రైమరీ వ్యక్తులతో కాంటాక్టులో ఉన్నవారంతా తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆ ప్రకటనలో గవర్నర్ కోరారు. ఎంత తొందరగా పరీక్షలు చేయించుకుని కరోనా ఉందో లేదో తేల్చుకోగలిగితే అంత త్వరగా కోలుకోడానికి, జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుందని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని కూడా ఆ మేరకు నివారించవచ్చని, ఇతరులకు అంటించకుండా జాగ్రత్తపడవచ్చునని వివరించారు. టెస్టులు చేయించుకోడానికి వెనకాడాల్సిన అవసరం లేదని, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇతరులను కూడా ప్రోత్సహించినట్లవుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే మూడు ప్రధానాంశాలతో పాటు ‘టీచ్’ అనేది కూడా నాల్గవ ప్రధానమైనదని పేర్కొన్నారు.