నాగాలాండ్ ఘటనపై అమిత్ షా వివరణ

by Shamantha N |
amitsha
X

న్యూఢిల్లీ: నాగాలాండ్ పౌరుల హత్యపై పొరపాటుకు కేంద్రం చింతిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం లోక్‌సభలో ప్రసంగిస్తూ ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. ‘మయన్మార్ సరిహద్దుల నుంచి మోన్ జిల్లాలోకి తీవ్రవాదులు చొరబడే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు సరిహద్దుల్లోని ఓటింగ్ గ్రామ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

అదే సమయంలో ఓ వాహనం వచ్చింది. జవాన్లు ఆపమని కోరినప్పటికీ, వారు ముందుకు వెళ్లారు. తీవ్రవాదులనే అనుమానంతో కాల్పులు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఆరు నుంచి ఎనిమిది మంది చనిపోయారు’ అని తెలిపారు. అయితే గుర్తింపులో లోపం జరిగిందని తర్వాత గ్రహించారని అన్నారు. గాయపడిన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు కోపంతో ఆర్మీ యూనిట్‌పై దాడి చేసి, వాహానాలకు నిప్పు అంటించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఓ సైనికుడు కూడా మరణించినట్లు తెలిపారు. ప్రజల నుంచి తమను కాపాడుకునే ప్రయత్నంలో భద్రతా దళాలు మరోసారి కాల్పులకు దిగగా, ఏడుగురు పౌరులు మరణించారని అన్నారు. ‘ఘటన జరిగిన తర్వాతి రోజు ఆదివారం మోన్ జిల్లాలో 250 మంది ఆందోళన కారులు అస్సాం రైఫిల్స్ పై దాడి చేశారు. వారిని చెదరగొట్టే క్రమంలో జరిగిన ఘర్షణలో మరో పౌరుడు చనిపోయాడు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నప్పటికీ, అదుపులోనే ఉన్నాయి. నాగాలాండ్ డీజీపీ, కమిషనర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రాష్ట్ర పోలీసులచే దర్యాప్తుకు ఆదేశించాం’ అని తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి 30 రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక అందిస్తామని వెల్లడించారు. అయితే నాగాలాండ్ ఘటనపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అమాయకుల ప్రాణాలు పోయిన ఘటనపై కేంద్రం ఏకపక్షంగా వివరణ ఇవ్వడం ఏంటని ప్రశ్నించాయి. కేంద్ర వైఖరికి నిరసనగా విపక్షాలు సభను వాకౌట్ చేశాయి.

Next Story

Most Viewed