అమెరికా.. మూడు దశల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తుందా?

by Shyam |

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సృష్టిస్తోన్న విలయతాండవానికి ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయింది అగ్రరాజ్యం అమెరికానే. ఈ దేశంలో అత్యధికులు ఈ వైరస్ బారిన పడటమే కాదు.. అత్యధికులు ప్రాణాలూ కోల్పోయారు. ప్రాణ నష్టం ఒకవైపు.. ఆర్థిక నష్టం మరోవైపు జరిగింది. అస్తవ్యవస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పలురంగాల నిపుణులను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకున్నారు. అమెరికాను పూర్తిగా షట్‌డౌన్ చేయడం వల్లే ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని.. దీనికి లాక్‌డౌన్ ఎత్తివేయడమే పరిష్కారమని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ దేశంలో ప్రతిరోజూ వేలాది కొత్త కేసులు నమోదవుతుండటం.. అత్యధిక మరణాలు సంభవిస్తుండటంతో.. అమెరికా పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా తయారైంది.

దేశం మొత్తం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే పరిస్థితి చేజారుతుంది కాబట్టి.. లాక్‌డౌన్ ఎత్తివేత అధికారాలను రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టే నిర్ణయాన్ని ట్రంప్ పాలకవర్గం తీసుకున్నది. అంతే కాక లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయాలని సూచించింది.

కరోనా పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య వరుసగా 14 రోజుల పాటు తగ్గితే ‘స్టే ఎట్ హోం’ నిబంధన సడలించవచ్చని.. ఇతర ఆంక్షల నుంచి కూడా మినహాయింపులు ఇవ్వొచ్చని గవర్నర్లకు సూచించింది. బయటకు వచ్చినా సరే భౌతిక దూరం పాటించడం అనే నిబంధన మాత్రం కఠినంగా అమలు చేస్తారు. ఇక రెండో దశలో వైరస్ లక్షణాలు ఉన్నవారిని, ఇతర జబ్బులతో బాధపడుతూ వైరస్ బారిన పడతారనే అనుమానాలు ఉన్న వారిని ఇండ్లకే పరిమితం చేయాలి. వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలి. మరోవైపు భౌతిక దూరం పాటిస్తూ మిగిలిన ప్రజలు బయటకు రావొచ్చు. సాధారణ ప్రయాణాలకు కూడా అనుమతులు ఇవ్వొచ్చు. కాని ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశాలు ఉన్న బార్లు, పబ్బులు, థియేటర్ల వంటివి మూసే ఉంచాలి. ఓపెన్ మార్కెట్లను తెరవవచ్చు.. కాని సామాజిక దూరాన్ని మాత్రం కచ్చితంగా అమలు చేయాలి. మూడో దశలో అందరినీ బయటకు అనుమతించవచ్చు. కాని వైరస్ పూర్తిగా అదుపులోనికి వచ్చిందని.. దానితో ప్రజలకు ఇక ప్రమాదం లేదని నిర్థారణకు వచ్చినప్పుడే మూడో దశ అమలు చేయాలి. కాగా, ఏ దశలోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు ఆపవద్దని.. వాటిని కొనసాగిస్తూనే దేశ ఆర్థికపరిస్థితి గాడిన పడటానికి మాత్రమే లాక్‌డౌన్ ఎత్తివేతను అమలు చేయాలని గవర్నర్లకు సూచించారు. కాగా, ఈ దశల వారీ లాక్‌డౌన్ ఎత్తివేత ఎప్పుట నుంచి అమలు చేయాలనేది మాత్రం ఆయా రాష్ట్ర గవర్నర్లే నిర్ణయిస్తారని ఫెడరల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags: coronavirus, pandemic, america, donald trump, lockdown, lift, staggered

Advertisement

Next Story

Most Viewed