‘నమస్తే’పై నిషేధం..

by Sujitha Rachapalli |   ( Updated:2021-05-22 08:09:48.0  )
‘నమస్తే’పై నిషేధం..
X

దిశ, ఫీచర్స్ : యూఎస్‌లోని అలబామా స్టేట్‌లోని పబ్లిక్ స్కూల్స్‌లో యోగా అభ్యసనంపై దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిషేధానికి తెరపడింది. గురువారం ఇందుకు సంబంధించిన బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్ ‘కే ఎవే’ సంతకం చేశారు. ఈ మేరకు కె-12 పబ్లిక్ స్కూల్ బోర్డ్స్‌లో యోగా టీచింగ్‌కు అనుమతించినట్టు గవర్నర్ ప్రెస్ సెక్రెటరీ జినా మైలోలా వెల్లడించింది. అలబామా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1993 ప్రారంభంలోనే అక్కడి స్టే్ట్ పబ్లిక్ స్కూళ్లలో యోగాను నిషేధించింది. దీనిపై కొంతకాలం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా రిపబ్లిక్ పార్టీకి చెందిన అపోనెంట్స్‌‌కు ఓదార్పుగా..‘నమస్తే’ పదంతో పాటు యోగాలోని ఇతర ఆధ్యాత్మిక వ్యక్తీకరణలను నిషేధిస్తూ అనుమతులివ్వడం గమనార్హం.

స్టేట్ పబ్లిక్ స్కూళ్లలో యోగా టీచింగ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అలబామాకు చెందిన లా మేకర్, యోగా ఫాలోవర్ అయిన జెరెమీ గ్రే.. కొన్ని వారాల కిందట గవర్నర్‌కు ఒక బిల్లును అందజేశారు. క్రమంగా అతడి వాదనకు మద్దతు పెరుగుతుండటంతో ఎట్టకేలకు గవర్నర్ నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం యోగాను భంగిమలు, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్ టెక్నిక్స్‌కు మాత్రమే పరిమితం చేయగా.. ఉచ్చరణలు, మంత్రాలు, యోగా ముద్రలు, నమస్తే గ్రీటింగ్స్ వంటి వ్యక్తీకరణలకు అనుమతించలేదు. అంతేకాదు యోగాభ్యాసన సమయంలో ఒరిజినల్ సంస్కృత పేర్లు కాకుండా ‘డౌన్‌వార్డ్ డాగ్’, ‘ది వారియర్’ వంటి ఇంగ్లీష్ పదాలనే వాడాలని సూచించింది.

కాగా ఈ నిర్ణయంపై కొందరు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం యోగా ‘గైడెడ్ ఇమాజినరీ’కి దారితీస్తుందని వ్యతిరేకిస్తున్నారు. హిందూ మతంలో ఓ భాగమైన యోగాను పాఠశాలల్లో అనుమతిస్తే మతం, ప్రభుత్వ విద్యకు మధ్య సరిహద్దును ఉల్లంఘిస్తుందని ఈగల్ ఫోరం ఆఫ్ అలబామాతో సహా సంప్రదాయవాదులు వాదిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed