అడవి బిడ్డలకు దారి చూపిన ‘ఆకాశవాణి’..

by Anukaran |   ( Updated:2021-09-26 00:41:29.0  )
అడవి బిడ్డలకు దారి చూపిన ‘ఆకాశవాణి’..
X

దిశ, ఫీచర్స్ : మట్టిని ముద్దాడి, మబ్బుకు దండం పెట్టి, రాయిని కొలిచే ఆ కోన జాతికి పిట్టలే సుట్టాలు, జంతువే జంగముడు. నాగరికులతో పొత్తులేని అడవి పుత్రులైనా, తినేది వేర్లు దుంపలే అయినా కష్టపడందే కానలో చోటుండదు. గొడ్డు, మేక, చెట్టు, పుట్ట ప్రతీది లెక్కే. తమకు ఆరాధ్య దైవమైన దొర స్వయం ప్రకటిత రాజ్యాంగం ఇది. దొర కోసమే బతకాలె, దొర కోసమే పాడాలె. పొరపాటున గీసిన బరి దాటితే, పొలిమేరను వీడితే.. ఆ దేవుడి కోపానికి బలికావల్సిందే. పాపంచేసిన వాడి ప్రాణాలు రాత్రికిరాత్రే దీపం రూపంలో కొండెక్కాల్సిందే. దొర అకృత్యాలను దేవుడి లీలలని నమ్మే ఆ అమాయకపు మట్టి మనుషులకు జనాభా లెక్కల్లో, జనన మరణాల్లో స్థానం లేదు. అడవిలో అడుగుపెట్టాలనుకున్న అధికారులు దొర గడీనైనా దాటలేరు. అలాంటి వారికి ఆకాశవాణి రూపంలో దేవుడే ప్రత్యక్షమైతే.. దొరనే దేవుడనుకున్నవారి అజ్ఞానం తొలగిపోయిందా? అప్పటిదాకా ఎవరైనా తప్పుచేస్తే కొండెక్కే దీపం వెనక్కి ఎలా వచ్చింది? నిజంగా దేవుడే వీరి కష్టాలు తీర్చేందుకు దిగొచ్చాడా? ప్రకృతి, సంకల్ప బలమే సమస్యకు పరిష్కారం చూపాయా? తెలియాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే.

నాగరిక జీవనానికి దూరంగా, బయటి మనుషుల ఊసే తెలియని కొందరు అడవి బిడ్డలు ఓ మన్నెం గూడెంలో నివసిస్తుంటారు. అక్కడి సమీప గ్రామానికి చెందిన ఓ దొర ఈ గూడెంపై పెత్తనం చెలాయిస్తూ ఆ జనాలకు దైవంగా చెలామణి అవుతుంటాడు. అడవిలోని కొంత భాగానికి సరిహద్దులు ఏర్పాటుచేసి, గంజాయి సాగు చేస్తుంటాడు. అవి జాయి తోటలని నమ్మిస్తూ స్థానికులతో గొడ్డు చాకిరీ చేయిస్తుంటాడు. దొర చెబితే దేవుడు చెప్పినట్టే అనే గుడ్డి నమ్మకాన్ని వారిలో కలిగించి, వినకపోతే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాడు. ఆ రాత్రికే సమీపంలోని కొండమీదికి ఓ దీపం రూపంలో వెళ్తాయని నమ్మిస్తూ అది ‘దేవుడి లీల’ అని చిత్రీకరిస్తుంటాడు. ఇదే సమయంలో దొర పుట్టినరోజున గూడెంలోని పిల్లలకు మిఠాయిలు పంచేందుకు వచ్చిన ఒక వ్యక్తి దగ్గరున్న ఓ పాత రేడియో గిడ్డడు అనే బాలున్ని ఆకర్షిస్తుంది. ఆ వ్యక్తికి ఓ చిన్న మేకను ఇచ్చి బదులుగా రేడియో తీసుకున్న గిడ్డడు.. సాయంత్రం వర్షానికి తమ గుడిశె మొత్తం కురుస్తుండటంతో ఎక్కడ దాచాలో తెలియక చెట్టు తొర్రలో దేవుడి రాయి ఉన్న ప్లేస్‌లో దాచిపెడతాడు. మందలో ఒక మేక తప్పిపోయిన విషయం దొరకి తెలియడంతో గిడ్డన్ని చావబాదుతారు. చావు బతుకుల్లో ఉన్న చిన్నోడిని దేవుడి దగ్గరకు తీసుకెళ్లి బతికించమని వేడుకుంటే.. గాలికి అటు ఇటు కదిలిన రేడియోకు సిగ్నల్స్ అంది ‘నిమ్మరసం, తేనె’ అనే మాటలు వినబడతాయి. గిడ్డడికి వెంటనే ఆ రసం తాగించడంతో బతుకుతాడు. అప్పుడు అందులో ఉన్న రేడియోనే నిజమైన దేవుడుగా భావించిన గూడెం జనం.. అప్పటి నుంచి దొర మాట విన్నారా? లేదా? ప్రమాదవశాత్తు అడవిలోకి వచ్చిన ఒక టీచర్ దొర అసలు రూపాన్ని ఎలా బయటపెట్టాడు? అన్నది మిగతా స్టోరీ..

ధ్వజ స్తంభంగా ఓ కరెంట్ పోల్..

రేడియోనే దేవుడిగా కొలుస్తున్న అటవీకుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు గుడి కట్టించిన దొర.. ఓ కరెంట్ పోల్‌‌ను నాటించి అదే ధ్వజ స్తంభమని నమ్మిస్తాడు. అయితే ,అనుకోకుండా గూడెంలోకి వచ్చిన ఓ టీచర్.. రేడియోలో ప్రసారమైన ‘హిరణ్యకశ్యప’ నాటిక ద్వారా దొర అక్రమాలను జనాలకు వివరించి కనువిప్పు కలిగిస్తాడు. దీంతో అతన్ని దేవుడు పంపిన మనిషిగా భావించిన గూడెం జనం దొరపై తిరగబడతారు. ఇదే క్రమంలో రేడియోను పగులగొట్టిన దొర చేతిలో ఉన్న కత్తికి అందులోని అయస్కాంతం అతుక్కుంటుంది. సరిగ్గా అదే సమయంలో ధ్వజ స్తంభంగా ఏర్పాటు చేసిన కరెంట్ పోల్‌పై పిడుగు పడటం.. అది అయస్కాంతానికి ఆకర్షించబడటంతో దొరకు షాక్ తగిలి చనిపోతాడు.

కట్టె, కఠిక రాయి.. కష్టాలు తీర్చేది ఏదైనా దేవుడే!

ఒక దశలో రేడియోను దేవుడు కాదని జనాలను నమ్మించేందుకు ప్రయత్నిస్తే.. ‘కట్టె అయితే ఏంటి? కఠిక రాయి అయితే ఏంటి? కష్టాలు తీర్చేది దేవుడే కదా!’ అని గూడెం పెద్ద చెప్పే మాట ఆలోచింపజేస్తుంది. చివరకు దొర పిడుగుపాటుకు గురై చనిపోవడం కాకతాళీయమా? లేక దేవుడి లీలనా? అనే విషయం మిస్టరీనే. అందుకే సినిమా ప్రారంభంలోనే చెప్పినట్టు మన ప్రశ్నలకు సమాధానం దొరికితే అది సైన్స్, చెప్పలేకుంటే అది దేవుడే!

– సంతోష్ దామెర

Advertisement

Next Story

Most Viewed