‘రైతులతో కన్నీరు పెట్టించిన టీఆర్ఎస్ సర్కార్.. ఇక పతనమే’

by Shyam |
AICC secretary Sampath Kumar
X

దిశ, భువనగిరి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా.. రైతులతో కన్నీరు పెట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయం అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, అకాల వర్షాల మూలంగా తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ… అప్పులు చేసి, ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం.. మార్కెట్‌లోనే మిగిలిపోతుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. ‘‘ఎద్దేడిసిన వ్యవసాయం.. రైతేడిసిన ప్రభుత్వం నిలబడిన దాఖలాలు లేవు’’ అని ఆయన గుర్తుచేశారు.

వర్షాలకు తడిసి మొలకలు రావడంతో తుర్కపల్లి, ముల్కలపల్లి పీఏసీఎస్‌ల వద్ద ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి వారికి మనోధైర్యం కల్పించారు. రైతులకు జరిగిన నష్టాన్ని, తడిసి మొలకలెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు మిల్లర్లతో కుమ్మకై వరి ధాన్యం సకాలంలో కొనడం లేదని, వారి అసమర్ధత మూలంగానే ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మిల్లర్లతో కుమ్మక్కై ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి-గ్రేడ్‌గా చూపుతూ కోట్లాది రూపాయలు దండుకుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story