మరోసారి ఉలిక్కిపడిన విశాఖ

దిశ, ఏపీ బ్యూరో: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన నుంచి తేరుకోకముందే మరోసారి విషవాయువు లీకేజీతో విశాఖపట్టణం ఉలిక్కిపడింది. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైంది. గత రాత్రి 11:30 గంటల సమయంలో రియాక్టర్ వద్ద చేరాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో హైడ్రోజన్ సల్ఫైట్ చేరడంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రమాదం జరిగిన మూడు గంటల తరువాత కంపెనీ తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించింది. ప్రమాదంలో షిఫ్ట్ ఇన్ ఛార్జీ రాగినాయుడు, కెమిస్ట్ గౌరీ శంకర్ ప్రాణాలు కోల్పోగా, ఉద్యోగులు ఎల్వీ చంద్రశేఖర్ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. పి ఆనంద్ బాబు, డీ జానకీరామ్, ఎం సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని, ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

Advertisement