ప్రైవేటులో ఫుల్.. గవర్నమెంట్‌లో నిల్

by Shyam |   ( Updated:2021-06-06 11:27:13.0  )
ప్రైవేటులో ఫుల్.. గవర్నమెంట్‌లో నిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సినేషన్‌ను చేపట్టేందుకు ప్రైవేటు ఆసుపత్రులు పోటీ పడి క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మే 7నుంచి ప్రైవేటు ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వడంతో.. మెఘా డ్రైవ్‌లను చేపట్టి ఒక రోజులోనే వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే 10,53,086 మందికి వ్యాక్సిన్ అందించగా.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుంచి 55,22,645 మందికి వ్యాక్సిన్ ను అందించారు. ప్రభుత్వం కేటగిరీల వారిగా వ్యాక్సిన్ అందిస్తుండగా.. ప్రైవేటు 18 ఏళ్లు దాటిన వారందరికి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టారు. వ్యాక్సిన్ కొనుగోలు చేయలేని పేదలు తమకు ఎప్పుడు వ్యాక్సిన్ అందుతుందని పడిగాపులు కాస్తున్నారు.

ప్రైవేట్‌లో పోటిపడి వ్యాక్సినేషన్

ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతులివ్వడంతో.. పోటీపడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. ప్రభుత్వం మే 7న ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పచ్చజెండా ఊపడంతో.. మెఘా డ్రైవ్‌లు నిర్వహించిన నెల రోజుల వ్యవధిలో ఇప్పటివరకు 10,53,086 డోసుల వ్యాక్సిన్‌ను అందించారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కోవాగ్జిన్‌ను రూ.1250కి, కోవీషీల్డ్‌ను రూ.850కి విక్రయిస్తూ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. మెడికవర్ ఆసుపత్రి మెఘా డ్రైవ్‌ను చేపట్టి ఒక రోజులోనే 50 వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. అపోలో ఆసుపత్రి ఇప్పటివరకు 2 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికి కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రకారం నిర్ణీత తేదీ, సమయాలను కేటాయించి వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్‌లు చేపట్టి పంపిణీ చేస్తున్నారు. వీటితో పలు ప్రైవేటు, కార్పోరేట్ సంస్థల్లోని లక్షా 40వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

సర్కారు వ్యాక్సిన్ కోసం పడిగాపులు

ప్రైవేటు ఆసుపత్రుల పరిధిలో 18 ఏళ్లు నిండిని ఉన్న అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం కేటగిరిలా వారిగా విభజించి వ్యాక్సిన్ ను అందిస్తుంది. దీంతో వ్యాక్సిన్ కొనుగోలు చేయలేని ప్రజలకు తమకు ఎప్పుడు వ్యాక్సిన్ అందుతుందానని పడిగాపులు కాస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించనప్పటి నుంచి ప్రభుత్వ పరిధిలో 55,22,645 డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. మొదటగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడిన వారికి, సూపర్ స్ప్రెడర్స్ గా కేటగిరిలు విభజించి వ్యాక్సిన్ ను చేపడుతున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మొదటి డోసు కొన్ని రోజులు, రెండవ డోసు మరిన్ని రోజుల పాటు విరామం చేపడుతూ పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో 1,178 వ్యాక్సినేషన్ సెంటర్లు

రాష్ట్రంలో మొత్తం 1,178 వ్యాక్సిన్ సెంటర్లకు టీకాను అందించేందుకు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వం 953 వ్యాక్సినేషన్ సెంటర్లను, ప్రైవేటు పరిధిలో 225 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం హెల్త్ కేర్ వర్కర్లకు 2,47,691 మందికి మొదటి డోసు, 1,90,331 మందికి రెండవ డోసు అందించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి డోసు 2,53,605 మందికి, రెండవ డోసు 98,573 మందికి అందించారు. 18 నుంచి 44 ఏళ్ల పైబడిన వారికి మొదటి డోసు 5,99,423 మందికి అందించారు. 45ఏళ్ల పైబడిన వారికి మొదటి డోసు 40,43,285, రెండవ డోసు 11,42,823 మందికి అందించారు. మొత్తం 51,44,004 మందికి మొదటి డోసు, 14,31,727 మందికి రెండవ డోసులు అందించారు.

Advertisement

Next Story

Most Viewed