లీటర్ వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేటు భోజనం రూ.7500 !

by Anukaran |   ( Updated:2021-08-28 04:06:02.0  )
లీటర్ వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేటు భోజనం రూ.7500 !
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా ప్రయాణం చేస్తే తప్పకుండా వాటర్ బాటిల్‌ను తమ వెంట తీసుకెళ్తారు. లేదా ఏదైనా బస్టాప్‌లో లేదా బస్సులోకి అమ్మడానికి వచ్చిన వారి దగ్గర కొనుగోలు చేస్తారు. అయితే ఆ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది. మా అంటే రూ. 20 లేదా మరీ ఎక్కువ కూల్ వాటర్ బాటిల్ అయితే రూ. 50 ఉంటుంది. కానీ ఎక్కడైనా వాటర్ బాటిల్‌కు రూ. 3000 ఉండటం చూశారా.. ? కానీ, అక్కడ ప్రయాణం చేస్తే మాత్రం వాటర్ బాటిల్‌కు రూ.3000, ప్లేట్ భోజనానికి 7500 చెల్లించాల్సిందే. ఈ విపరీతమనై ధరలతో ఆ ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. కాబూల్ విమానాశ్రయంలో ఈ దోపిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అఫ్గనిస్థాన్‌లో చాలా దయనీయమైన పరిస్థితి నెలకొంది. అఫ్గాన్‌‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్ల నుంచి తప్పిచుకోవడానికి ఆఫ్గాన్‌లు చూస్తున్నారు. చాలా మంది దేశాన్నే వదిలి వెళ్లి పోయారు. తమకు కూడా అవకాశం రాకపోతుందా తాలిబన్ల నుంచి బయటపడమా అనే ఆశతో విమానాశ్రయంలోనే చాలామంది నిరీక్షిస్తున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్నారు. తినడానికి కూడా బుక్కెడు బువ్వ దొరకని పరిస్తితులు నెలకొన్నాయి. ఎంతో మంది తాగడానికి నీరు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. తాలిబన్ల చేతిలో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి చేయూతనివ్వాల్సింది పోయి, కొందరు వ్యాపారులు దీనినే అదునుగా తీసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారు. విమానాశ్రయంలో ఆహారం, నీళ్లు, శీతలపానీయాల ధరలను ఊహించని విధంగా పెంచేశారు. ‘ప్లేట్ భోజనానికి 100 డాలర్లు(సుమారు రూ.7500), లీటర్ మంచినీళ్ల బాటిల్​కి రూ.3,000, చెల్లించాల్సి వస్తోంది. దుకాణదారులు అఫ్గానీ కరెన్సీకి బదులు డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రజలు ఆకలితో ఎండలోనే నిలబడాల్సిన దుస్థితి నెలకొంది,’ అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా అమాంతంగా పెరిగిపోయిన ధరలతో ఆఫ్గాన్‌లు ఆకలికి అల్లాడుతున్నారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.

Advertisement

Next Story