గ్రేటర్‌పై CM రేవంత్ స్పెషల్ ఫోకస్.. విపక్షాలను వీక్ చేసేలా సూపర్ ప్లాన్

by GSrikanth |
గ్రేటర్‌పై CM రేవంత్ స్పెషల్ ఫోకస్.. విపక్షాలను వీక్ చేసేలా సూపర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నగర పరిధిలోని సొంత పార్టీ లీడర్లను ఎంకరేజ్ చేస్తూనే, విపక్షాల్లో ఉన్న బలమైన లీడర్లను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో బీఆర్ఎస్​కు చెందిన సుమారు 25 మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోని మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈనెల 12న పరేడ్ గ్రౌండ్స్​లో మహిళ సదస్సు నిర్వహిస్తున్నారు.

3 ఎంపీ స్థానాలపై నజర్

జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ళ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే సికింద్రాబాద్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. చేవెళ్ల లోకసభ పరిధిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ స్థానాలు గెలవడం కాంగ్రెస్​కు పెద్ద సవాలుగా మారింది. ఇక్కడ గెలవకపోతే ఇప్పటికే పార్టీకి ఉన్న కాస్త ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం మరో ఏడాదిన్నర కాలంలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఉంటుదన్న ఆందోళనలో లీడర్లు ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి స్వయంగా ఈ మూడు ఎంపీ స్థానాలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తున్నది.

విపక్షాలను వీక్ చేసే ప్లాన్

ఈ మూడు స్థానాలకు చెందిన సొంత పార్టీ లీడర్లలో జోష్ నింపడంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్​ను కట్టడి చేసేందుకు రేవంత్ రెడీ అయ్యారు. త్వరలో 25 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్​లోకి చేర్చుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. లోకసభ ఎన్నికల షెడ్యూలు వచ్చిన వెంటనే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో పార్టీలో కొత్త ఊపు రావడంతో పాటు మూడు ఎంపీ స్థానాలను గెలుచుకోవడం చాలా సులువు అవుతుందని ఆశిస్తున్నారు.

ఈనెల 12న మహిళా సదస్సు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నించి ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజకీయ సభలను నిర్వహించలేదు. ఈనెల 12న పరేడ్ గ్రౌండ్స్​లో మహిళా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మీటింగ్​కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తోన్న ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్​పై అవగాహన కల్పించనున్నారు. దీనితో మహిళా ఓటర్లకు చేరువ కావచ్చని కాంగ్రెస్ లీడర్లు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed