జితేశ్ కాదు.. అతనే మా వైస్ కెప్టెన్ : క్లారిటీ ఇచ్చిన పంజాబ్

by Harish |
జితేశ్ కాదు.. అతనే మా వైస్ కెప్టెన్ : క్లారిటీ ఇచ్చిన పంజాబ్
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమవడంతో జట్టును సామ్ కర్రన్ నడిపించిన విషయం తెలిసిందే. వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ సారథ్యం వహించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ సీజన్‌లో జితేశ్ రాణించకపోవడంతోనే అతన్ని వైస్ కెప్టెన్‌గా తప్పించారంటూ వార్తలు వచ్చాయి. అయితే, జితేశ్ శర్మ వైస్ కెప్టెనే కాదట. పంజాబ్ వైస్ కెప్టెన్ సామ్ కర్రన్ అని ఆ జట్టు కోచ్ సంజయ్ బంగర్ క్లారిటీ ఇచ్చాడు.

ఐపీఎల్-17 కెప్టెన్ల ఫొటోషూట్‌కు జితేశ్ హాజరయ్యాడు. అప్పుడు ఐపీఎల్ నిర్వాహకులు జితేశ్ శర్మను వైస్ కెప్టెన్‌గా పేర్కొంటూ ట్వీట్ చేయడంతో అందరూ అతనే ధావన్ డిప్యూటీ అని అనుకున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం సంజయ్ బంగర్ దీనిపై స్పష్టతనిచ్చాడు. ‘జితేశ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించలేదు. కెప్టెన్ల మీటింగ్‌కు అతను హాజరవడంతో ఆ అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. సామ్ కర్రన్ ఇంగ్లాండ్‌ నుంచి ఆలస్యంగా రావడంతో అతన్ని చైన్నయ్‌కు పంపలేకపోయాం. అయితే, జట్టు నుంచి కచ్చితంగా ఒక ఆటగాడు హాజరుకావాలని ఐపీఎల్ సభ్యుడు ఆదేశం మేరకు జితేశ్‌ను పంపించాం. కానీ, అతన్ని వైస్ కెప్టెన్‌గా ఎప్పుడూ ఆలోచించలేదు.’ అని సంజయ్ బంగర్ తెలిపాడు.

వారం రోజులు ధావన్‌ దూరం

కెప్టెన్ ధావన్‌ గాయంపై సంజయ్ బంగర్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘ధావన్‌ భుజానికి గాయమైంది. అతను మరో వారం రోజులుపాటు మైదానంలో దిగడం కష్టమేనని అనిపిస్తోంది. చికిత్సకు అతను ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి’ అని చెప్పాడు.

Advertisement

Next Story