జైశ్వాల్ శతక్కొట్టి గెలిపించెన్

by Harish |
జైశ్వాల్ శతక్కొట్టి గెలిపించెన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురులేకుండా పోయింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ జట్టుకు హ్యాట్రిక్ విజయం. సోమవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 179/9 స్కోరు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(65) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. నేహాల్(49) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ(5/18) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(104 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోవడంతో రాజస్థాన్ అలవోకగా నెగ్గింది. రాజస్థాన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం.

గేర్ మార్చిన జైశ్వాల్

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైశ్వాల్.. ఆ దూకుడును లీగ్‌లో కొనసాగించలేకపోయాడు. దీంతో అతని ఫామ్‌పై అనుమానాలు నెలకొన్న తరుణంలో ముంబైపై రెచ్చిపోయాడు. రాజస్థాన్ 180 లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఎలాంటి తడబాటుకు గురి కాకుండా ఛేదించిందంటే కారణం అతనే. మొదట ఇన్నింగ్స్‌ను నిదానంగానే ప్రారంభించిన జైశ్వాల్.. గెరాల్డ్ కొయ్టజి బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో గేర్ మార్చాడు. అతనికితోడు మరో ఓపెనర్ బట్లర్ కూడా ధాటిగానే ఆడటంతో రాజస్థాన్ పవర్ ప్లేలో 61/0తో నిలిచింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభమైన కాసేపటికే చావ్లా బౌలింగ్‌లో బట్లర్(35) బౌల్డ్ అవడంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శాంసన్‌తో కలిసి జైశ్వాల్ జట్టును నడిపించాడు. ఈ క్రమంలోనే 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతను.. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. మరోవైపు, శాంసన్ కూడా అతనికి సహకరించడంతో జట్టు విజయానికి చేరువైంది. ఈ క్రమంలో 19వ ఓవర్‌లో తొలి బంతికి సింగిల్ తీసిన జైశ్వాల్ ఐపీఎల్‌లో రెండో శతకం నమోదు చేశాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతికి ఫోర్ కొట్టి గెలుపు లాంఛనం చేశాడు.

నిప్పులు చెరిగిన సందీప్.. ఆదుకున్న తిలక్, నేహాల్

అంతకుముందు పేసర్ సందీప్ శర్మ ధాటికి తడబడిన ముంబై జట్టు కష్టంగా పోరాడే స్కోరు సాధించింది. మొదటి నుంచి రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేయడంతో ముంబై ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఓపెనర్ రోహిత్ శర్మ(6)ను బౌల్ట్ తొలి ఓవర్‌లోనే అవుట్ చేసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సందీప్ శర్మ వరుస ఓవర్లలో ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్(10)‌లను పంపడంతో ముంబై జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. మొదట నబీ(23)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. చాహల్ బౌలింగ్‌లో నబీ అవుటైన తర్వాత అతనికి నేహాల్ తోడయ్యాడు. అప్పటి వరకు నిదానంగా ఆడిన తిలక్.. అశ్విన్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాది గేర్ మార్చాడు. ఈ క్రమంలో తిలక్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు, నేహాల్ ధాటిగా బ్యాటు ఝుళిపించాడు. అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. దీంతో చూస్తుండగానే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, బౌల్ట్ బౌలింగ్‌లో నేహాల్(49) అవుటై తృటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన పాండ్యా(10) నిరాశపర్చాడు. చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసిన సందీప్ శర్మ.. తిలక్(65)తోపాటు కోయ్టజి(0), టిమ్ డేవిడ్(30)లను పెవిలియన్ పంపి ముంబై భారీ స్కోరు చేయకుండా నిలువరించాడు. ముంబై బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్ 2 వికెట్లు తీసుకున్నాడు. అవేశ్ ఖాన్, చాహల్‌కు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 179/9(20 ఓవర్లు)

రోహిత్(సి)శాంసన్(బి)బౌల్ట్ 6, ఇషాన్ కిషన్(సి)శాంసన్(బి)సందీప్ 0, సూర్యకుమార్(సి)పొవెల్(బి)సందీప్ 10, తిలక్ వర్మ(సి)పొవెల్(బి)సందీప్ 65, నబీ(సి అండ్ బి) చాహల్ 23, నేహాల్(సి)సందీప్(బి)బౌల్ట్ 49, పాండ్యా ఎల్బీడబ్ల్యూ(బి)అవేశ్ ఖాన్ 10, టిమ్ డేవిడ్(సి)రియాన్ పరాగ్(బి)సందీప్ 3, గెరాల్డ్ కోయ్టజి(సి)హెట్మేయర్(బి)సందీప్ 0, చావ్లా 1 నాటౌట్, బుమ్రా 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.

వికెట్ల పతనం : 6-1, 6-2, 20-3, 52-4, 151-5, 170-6, 176-7, 176-8, 177-9

బౌలింగ్ : బౌల్ట్(4-0-32-2), సందీప్ శర్మ(4-0-18-5), అవేశ్ ఖాన్(4-0-49-1), అశ్విన్(4-0-31-0), చాహల్(4-0-48-1)

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 183/1(18.4 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్ 104 నాటౌట్, బట్లర్(బి)చావ్లా 35, శాంసన్ 38 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6.

వికెట్ల పతనం : 74-1

బౌలింగ్ : పాండ్యా(2-0-21-0), బుమ్రా(4-0-37-0), నువాన్ తుషార(3-0-28-0), గెరాల్డ్ కోయ్టజి(2-0-25-0), నబీ(3-0-30-0), పీయూశ్ చావ్లా(4-0-33-1), తిలక్ వర్మ(0.4-0-8-0)

Advertisement

Next Story

Most Viewed