పంజా విసిరిన శశాంక్.. గుజరాత్‌పై పంజాబ్ గెలుపు

by Harish |
పంజా విసిరిన శశాంక్.. గుజరాత్‌పై పంజాబ్ గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో వరుసగా రెండు పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌‌పై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 199/4 స్కోరు చేసింది. గిల్(89 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. సాయి సుదర్శన్(33), రాహుల్ తెవాటియా(23 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శశాంక్ సింగ్(61 నాటౌట్) అద్భుత పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అశుతోష్ శర్మ(31), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(35) రాణించారు. పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ 5వ స్థానంలో నిలువగా.. గుజరాత్ 6వ స్థానంలో ఉన్నది.

ఓటమి దిశ నుంచి గెలుపు తీరాలకు..

లక్ష్య ఛేదనలో గుజరాత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్‌ ఇన్నింగ్స్ మొదట్లో కుదుపులకు లోనైంది. ఓపెనర్, కెప్టెన్ ధావన్(1) నిరాశపర్చడంతో 13 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బెయిర్ స్టో(22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(35) ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే, స్వల్ప వ్యవధిలో వీరితోపాటు సామ్ కర్రన్(5) అవుటవడంతో 70/4 స్కోరుతో పంజాబ్ కష్టాల్లో పడింది. దీంతో గుజరాత్ విజయం సునాయాసంగా కనిపించింది. అయితే, క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ తన ఆటతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. వచ్చి రావడంతోనే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టాడు. అయితే, మరో ఎండ్‌లో సికిందర్ రజా(15), జితేశ్ శర్మ(16) నిరాశపర్చిన వేళ శశాంక్ అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. ఈ క్రమంలోనే అతను 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో శశాంక్‌కు ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ దూకుడు కూడా తోడవడంతో పంజాబ్‌ గెలుపు దిశగా వెళ్లింది. వీరిద్దరూ 18, 19 ఓవర్లలో 34 పరుగులు పిండుకోవడంతో చివరి ఓవర్‌లో పంజాబ్ లక్ష్యం 7గా మారింది. తొలి బంతికే అశుతోష్ శర్మ(31) భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటవ్వగా.. హర్‌ప్రీత్(1 నాటౌట్) సహకారంతో శశాంక్ మిగతా పనిపూర్తి చేశాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, ఉమేశ్, రషీద్ ఖాన్, మోహిత్, దర్శన్‌లకు చెరో వికెట్ దక్కింది.

గిల్ చివరి వరకు

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(11) స్వల్ప స్కోరుకే రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికే ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మరో ఓపెనర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(89 నాటౌట్) జట్టుకు అండగా నిలిచాడు. చివరి వరకు అజేయంగా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. సాహా అవుటైన తర్వాత కేన్ విలియమ్సన్(26)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. కేన్‌ వెనుదిరిగిన తర్వాత గిల్‌కు సాయి సుదర్శన్ తోడయ్యాడు. సుదర్శన్ సైతం దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు వేగం పెరిగింది. మూడో వికెట్‌కు ఈ జోడీ 53 పరుగులు జోడించింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సుదర్శన్‌(33) అవుటవడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. ఆ తర్వాతి ఓవర్‌లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను మరింత చెలరేగాడు. మరో ఎండ్‌లో విజయ్ శంకర్(8) నిరాశపర్చగా.. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా(23 నాటౌట్) చివరి రెండు ఓవర్లలో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ముందు గుజరాత్ 200 పరుగుల లక్ష్యం పెట్టింది. పంజాబ్ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్‌ చెరో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 199/4(20 ఓవర్లు)

సాహా(సి)ధావన్(బి)రబాడ 11, గిల్ 89 నాటౌట్, విలియమ్సన్(సి)బెయిర్‌స్టో(బి)హర్‌ప్రీత్ బ్రార్ 26, సాయి సుదర్శన్(సి)జితేశ్(బి)హర్షల్ 33, విజయ్ శంకర్(సి)హర్‌ప్రీత్ బ్రార్(బి)రబాడ 8, రాహుల్ తెవాటియా 23 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 29-1, 69-2, 122-3, 164-4

బౌలింగ్ : హర్‌ప్రీత్ బ్రార్(4-0-33-1), అర్ష్‌దీప్(4-0-33-0), రబాడ(4-0-44-2), సామ్ కర్రన్(2-0-18-0),హర్షల్ పటేల్(4-0-44-1), సికిందర్ రజా(2-0-22-0)

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 200/7(19.5 ఓవర్లు)

ధావన్(బి)ఉమేశ్ 1, బెయిర్‌స్టో(బి)నూర్ అహ్మద్ 22, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(సి)మోహిత్(బి)నూర్ అహ్మద్ 35, సామ్ కర్రన్(సి)విలియమ్సన్(బి)అజ్మతుల్లా 5, సికిందర్ రజా(సి)సాహా(బి)మోహిత్ 15, శశాంక్ సింగ్ 61 నాటౌట్, జితేశ్(సి)దర్శన్(బి)రషీద్ 16, అశుతోష్ శర్మ(సి)రషీద్(బి)దర్శన్ 31, హర్‌ప్రీత్ బ్రార్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.

వికెట్ల పతనం : 13-1, 48-2, 64-3, 70-4, 111-5, 150-6, 193-7

బౌలింగ్ : అజ్మతుల్లా(4-0-41-1), ఉమేశ్(3-0-35-1), రషీద్(4-0-40-1), నూర్ అహ్మద్(4-0-32-2), మోహిత్(4-0-38-1), దర్శన్(0.5-0-6-1)

Advertisement

Next Story

Most Viewed