- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై బోణీ కొట్టేనా?.. రేపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాడోపేడో
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 రసవత్తరంగా సాగుతోంది. కొన్ని జట్లు వరుస విజయాలతో దూకుడుగా ఉంటే.. మరికొన్ని జట్లు గెలుపు, ఓటములతో ముందుకు సాగుతున్నాయి. అయితే, ఒక్క జట్టు మాత్రం ఇంకా టోర్నీలో గెలుపు ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. బోణీ కోసం ఇంకా ఎదురుచూస్తేనే ఉన్నది. ఆ జట్టే ముంబై ఇండియన్స్. టోర్నీలో ఇంకా వెనుకపడకముందే ఆ టీమ్ పుంజుకోవడం అవసరం. ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఎదుర్కోనుంది. మరి, ఈ మ్యాచ్‌లోనైనా ముంబై జట్టు బోణీ కొడుతుందో?లేదో? చూడాలి.
ఈ సీజన్‌లో ముంబై జట్టు వరుసగా గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ చేతిలో పరాజయాలు చవిచూసింది. ముంబై టీమ్‌లో స్టార్లకు కొదవలేదు. అయితే, నిలకడలేమి సమస్యగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్, ఇషాన్ జట్టుకు ఆరంభాన్ని అందించడంలో విఫలమవుతున్నారు. ఆ ప్రభావంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఒత్తిడిలో వికెట్లు పారేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో ముంబై తరపున హాఫ్ సెంచరీ చేసింది తిలక్ మాత్రమే. అతనొక్కడే కాస్త నిలకడగా రాణిస్తున్నాడు. నమన్ ధిర్, డెవాల్డ్ బ్రెవిస్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండగా.. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ హిట్టర్ రోల్‌కు న్యాయం చేయలేకపోతున్నారు. గత మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో సూర్యకుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను తిరిగి రావడం ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేదే. అయితే, ఢిల్లీతో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది. బౌలింగ్ పరంగా కూడా ముంబై పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. స్టార్ బౌలర్ బుమ్రా గుజరాత్‌పై 3 వికెట్లతో సత్తాచాటినా.. గత రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కెప్టెన్ పాండ్యా బ్యాటుతోపాటు బంతితోనూ తన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మిగతా బౌలర్ల ప్రదర్శన గొప్పగా ఏం లేదు. కాబట్టి, ముంబై బ్యాటింగ్, బౌలింగ్ పరంగా లోపాలను అధిగమించాల్సి ఉంది.
కెప్టెన్సీ వివాదం..
ముంబై ప్రదర్శన కంటే ఈ సీజన్‌లో కెప్టెన్సీ మార్పుతోనే ఆ జట్టు ఎక్కువగా చర్చల్లో నిలిచింది. ఐదుసార్లు ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను తప్పించిన ఫ్రాంచైజీ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. దీంతో పాండ్యా అభిమానుల నుంచి దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. మరోవైపు, ఈ నిర్ణయం ద్వారా జట్టు రెండు వర్గాలు చీలిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు రోహిత్ వైపు ఉంటే, మరికొందరు పాండ్యాకు మద్దతు తెలుపుతున్నారని ఆ వార్తల సారాంశం. జట్టులో ఐక్యత లేకపోవడం కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపనుంది. కాబట్టి, ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో ఐక్యత కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముంబై జట్టులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు మైదానంలో కలిసికట్టుగా ఆడితేనే ఈ సీజన్‌లో ఆ జట్టు ముందుకు వెళ్లగలగుతుంది.