ఎంజీఎంలో నిలువు దోపిడీ ముఠా అరెస్ట్‌

by Disha Web Desk 23 |
ఎంజీఎంలో నిలువు దోపిడీ ముఠా అరెస్ట్‌
X

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో పేషంట్ల అసిసెంట్ల నిలువుదోపిడీ ముఠాను వరంగల్‌ సీసీఎస్‌, మట్టెవాడ పోలీసులు పట్టుకున్నారు. రోగుల వెంట ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నచ్చజెప్పి నగల చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమను నమ్మిన మహిళలను మీ సేవలో దరఖాస్తు కోసం ఫోటో దిగాలనే సాకుతో ఒంటి మీద నగలను తొలగించాలని చెప్పి వాటితో ఉడాయించిన మహిళతోపాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.6.60లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలిగా చుంచు స్వప్న అలియాస్‌ సానియాగా నిర్ధారించారు. స్వప్న జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించే ఆలోచనతో ఈ ప్లాన్‌ వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వప్నపై పదేళ్ల క్రితం ములుగు పోలీస్‌ స్టేషన్‌లో చోరీ కేసు నమోదైంది. 2023లో హన్మకొండ, ములుగు ఠాణాల పరిధిలో లోన్ల పేరిట పలువురు మహిళల నగలు దొంగిలించిన కేసుల్లో జైలుకెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం స్వప్న మొదటి భర్త ఫిరోజు వరంగల్‌ ఆటోనగర్‌లోని కోట చెరువు వద్దకి చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోగా అతని స్నేహితుడైన కాజా పాషాను 3 నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Next Story

Most Viewed