కారులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

by Aamani |
కారులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
X

దిశ, దుండిగల్, పేట్ బషీరాబాద్: గంజాయి రవాణాకు అనుగుణంగా కారు డిక్కీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 86 కేజీల గంజాయిని దుండిగల్ పోలీసులు, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పేట్ బషీరాబాద్ లో ఉన్న మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన సునీంద్ర కుమార్ సింగ్ (25) కు హోండా సిటీ కారు ఉన్నది. ఇతను ఇదే రాష్ట్రానికి చెందిన రాజుతో కలిసి తన కారులో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. రాజుకు తెలిసిన మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కు చెందిన శివ గంజాయిని అటవీ ప్రాంతాల గుండా ఒడిశా బెర్హంపూర్ నుంచి భద్రాచలం వైపు తీసుకొస్తూ ఉంటాడు. రాజు సలహాతో సునీంద్ర కుమార్ తన కారులో ఉన్న డిక్కీలో గంజాయిని తరలించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపించాడు. ఈనెల 18వ తేదీన రాజు సూచనలతో శివ సునీంద్ర కుమార్ సింగ్ నుంచి కారు తీసుకుని దానిలో ఏర్పాటుచేసిన సీక్రెట్ బాక్స్ లో ఒక కేజీ రెండు కేజీల పరిమాణంతో గంజాయిని ప్యాక్ చేసి, మొత్తంగా 86 కేజీల గంజాయిని కారు డిక్కీ లో ఉన్న రహస్యపు బాక్స్ లో పెట్టి 19వ తేదీన నాడు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు వద్దకు తీసుకువచ్చారు.

భార్యగా నటించేందుకు బేరం..

ఈ గంజాయిని ఢిల్లీలో ఉన్న అమిత్ అగర్వాల్ కి చేరవేసేందుకు సునీంద్ర సింగ్ పోలీసుల చెకింగ్ నుంచి తప్పించుకుంటానికి ఒక మహిళను తన భార్యగా నటించడానికి బేరం కుదుర్చుకున్నాడు. మల్కన్గిరి జిల్లాకు చెందిన లక్ష్మీ (30) అనే మహిళకు 6 వేలకు ఒప్పందం కుదుర్చుకొని కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. దారిలో చెక్ పోస్టుల వద్ద భార్యగా నటిస్తున్న లక్ష్మి ని చూపించి తనకు ఆరోగ్యం బాలేదని ఢిల్లీలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో వీరి కదలికలపై నిఘా పెట్టిన రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు లో వెంబడిస్తూ దుండిగల్ పోలీసుల సహాయంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 వద్ద ఉన్న సర్వీస్ రోడ్డులో కారును అడ్డగించి తనిఖీలు చేశారు.

దీంతో కారులో ఉన్న 86 కేజీల గంజాయిని గుర్తించడంతో సురేంద్ర కుమార్ సింగ్, లక్ష్మీ లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్స్ ను, రూ.11 వేల 710 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా సురేంద్ర కుమార్ సింగ్ పై ఆంధ్ర ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్డిపీ ఎస్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ డి శ్రీనివాస్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దుండిగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి సతీష్, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story