కన్నకొడుకే కాలయముడు...ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు

by Kalyani |
కన్నకొడుకే కాలయముడు...ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు
X

దిశ, ఝరాసంగం : ఆస్తి కోసం కుమారుడు కన్న తండ్రిని హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన టి.మారుతి (75)వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు నలుగురు కుమారులు. రెండవ కుమారుడు శ్రీనివాస్ కుప్పానగర్ గ్రామ శివారులో ఉన్న భూమిలో తనకు వచ్చిన వాటా తన పేరుపై పట్టా చేసి ఇవ్వాలని తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈ నెల 15న పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు.

మృతుడు మారుతి రోజు మాదిరిగానే సోమవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద నివాసం ఉండే ఇంటికి నిద్రించేందుకు వెళ్లాడు. వినాయక నిమజ్జనం అనంతరం అర్థరాత్రి సమయంలో మరో కుమారుడు నిద్రించేందుకు వ్యవసాయం పొలం వద్ద ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు తండ్రి బోర్లపడి, ముఖంపై తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్న తండ్రిని కుమారుడు హత్య చేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. హత్య చేసిన కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story