ఆశ చూపి మోసం చేశాడు..

by Sumithra |
ఆశ చూపి మోసం చేశాడు..
X

దిశ, భీంగల్ : పొట్టచేత బట్టుకొని బ్రతుకు దెరువు కోసం భార్య, పిల్లలని వదిలి గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా వెళ్లి ఏదో ఒక పని చేసుకొంటూ జీవిస్తున్న గల్ఫ్ కార్మికులను నమ్మించిన ఓ ఘనుడు సుమారు రూ. 4 కోట్లకు పై చిలుకు టోకర వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన రాజగౌడ్ అనే ఘనుడు సౌదీలో పనిచేసుకొంటూ గత కొన్ని నెలల క్రితమే హుండీ వ్యాపారం మొదలెట్టినట్లు తెలిసింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే హవాలా హుండీ ప్రారంభించిన రాజగౌడ్ అక్కడి బ్యాంక్ లో ఇచ్చే రేట్ కంటే ఎక్కవ రేట్ ను ఇచ్చి కొన్ని రోజులు గల్ఫ్ కార్మికులు నమ్మించాడు. ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్లుగా లెక్క తప్పకుండా వారి వారి ఇండ్లకు చేరవేశాడు. ఎవ్వరూ ఇవ్వని రీతిలో రాజగౌడ్ డబ్బులు హుండీలో పంపితే రేట్ ఎక్కవ ఇస్తున్నట్లు నమ్మించి కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన పలువురు గల్ఫ్ కార్మికులను నమ్మించి వారి వద్ద డబ్బులు వసూలు చేశాడు. మోసగాడిని నమ్మిన గల్ఫ్ కార్మికులు ఎక్కవ మొత్తంలో తమ ఇంటికి పంపమని అక్కడి రీయాల్స్ ఇవ్వగా, మరికొందరు అప్పుగా లక్షల్లో ఇచ్చి మోసపోయినట్లు సమాచారం. అంతా ప్లాన్ ప్రకారమే చేసిన రాజగౌడ్ తన ప్లాన్ లో భాగంగా తన తమ్ముడు రఘుగౌడ్ ను సౌదీకి తెప్పించుకొన్నాడు.

అక్కడే ఇద్దరన్నదమ్ములు కలిసి అక్కడి కార్మికుల అత్యాశను ఆసరాగా చేసుకొని అందినంతా వసూలు చేసుకొన్నారు. వసూలు చేసిన డబ్బంతా పథకం ప్రకారం హవాలాలో ఇండియాకు పంపించుకొని ఇండియాకు పరారై వచ్చినట్లు సమాచారం. ఇండియాకు వస్తు వాళ్ళ అమ్మానాన్నలను ముందుగానే అలర్ట్ చేసిన రాజు వాళ్ళ అత్త, మామలను సైతం పరారీ కోసం అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాజగౌడ్ చెప్పినట్లే ఇండ్లకు తాళం వేసుకొని కుటుంబీకులు సైతం పరారయ్యారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొన్న భాధితులు నిందితుడు రాజగౌడ్ గురించి విషయాన్ని వివరించి బషీరాబాద్ కు వచ్చి వాకబు చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో డబ్బులు తీసుకొని పరారి అయినట్లు తెలిసింది.

అందరినీ వదిలి పెట్టి గల్ఫ్ లో చెమటోడ్చి సంపాదించిన సొమ్ము కాస్తా నమ్మించి టోకర వెయ్యడంతో భాధిత గల్ఫ్ కార్మిక కుటుంబాలు కన్నీటి పర్యంతమైతున్నాయి. హుండీ పేరుతోనే కాకుండా ఈ మోసకారి వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని నమ్మబలికి సుమారు రూ. 40 లక్షల వరకు అప్పుగా తీసుకొని ఉడాయించి వచ్చినట్లు తెలిసింది. ఇలా ఈ మోసకారి మాటలు, చేతలకు మోసపోయిన భాధితుల సంఖ్య, వసూలు చేసిన డబ్బుల లెక్క రోజు రోజుకు పెరిగి పోతున్నట్లు తెలిసింది. ఈ ఘరానా మోసగాడు తన కుటుంబంతో మహారాష్ట్రకు పారిపోయినట్లు సమాచారం మేరకు వారి కోసం భాధితులు అన్వేషణ మొదలెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజగౌడ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను మహారాష్ట్ర లోని ఓ ప్రాంతంలో పట్టుకొని తీసుకు వస్తున్నారని వదంతులు వ్యాపించాయి.

Next Story

Most Viewed