కామారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్..

by Sumithra |
కామారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్..
X

దిశ, మాచారెడ్డి : విదేశాల్లో ఉన్న మీ కూతురు ఆపదలో చిక్కుకుందని ఫోన్ వస్తే ఏ తండ్రైనా వెనకాముందు ఆలోచిస్తాడా...అదే బాట పట్టారు సైబర్ నేరగాళ్లు. అమెరికాలో ఉన్న మీ కూతురు ఓ కేసులో చిక్కుకుంది. ఆ కేసులో నుంచి బయటకు రావాలంటే రూ.2 లక్షలు పంపండి. అంటూ సైబర్ నేరగాళ్లు సెంటిమెంట్ మోసానికి తెర లేపారు. ఓ రైతు నుంచి రూ.లక్ష కాజేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామానికి చెందిన నారెడ్డి వెంకట్ రెడ్డి కూతురు రాధవి అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. వెంకట్ రెడ్డికి గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. మీ కూతురు ఆపదలో ఉందని చెప్పి హిందీలో మాట్లాడి నమ్మించారు. కూతురు ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించారు. ఆ ఏడుపు లో శబ్ధం అచ్చు ఆయన కూతురు స్వరంనే పోలి ఉండడంతో ఆయన పూర్తిగా నమ్మారు.

వెంటనే ఆయన మరో ఫోన్లో నుంచి తన కూతురు నంబరుకు ఫోన్ చేయగా కలవలేదు. సైబర్ నేరగాళ్లు అవతలి వారి నెంబర్ కలువకుండా ముందు జాగ్రత్త పడడం విశేషం. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మూడు విడతల్లో రూ. లక్ష నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా డబ్బులు కోసం డిమాండ్ చేయగా.. అనుమానం వచ్చి బంధువుల ద్వారా తిరిగి కూతురిని సంప్రదించారు. తాను మోసపోయినట్లు వెంకట్ రెడ్డి గుర్తించారు. అమెరికాలో తన కూతురు ఉన్నట్టు ఎలా తెలుసుకున్నారు. నా నెంబర్ ఎలా తెలుసుకున్నారంటూ లబోదిబోమంటున్నారు. సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు బలవుతున్న ఈ సైబర్ నేరగాళ్ల నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామోనని నిట్టూరుస్తున్నారు. జరిగిన మోసం పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed