Muchumarri incident: లాకప్‌ డెత్తా...ఆత్మహత్యా..?

by srinivas |
Muchumarri incident: లాకప్‌ డెత్తా...ఆత్మహత్యా..?
X

దిశ. నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్‌ స్టేషన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సమాచారం.

బాలిక మృతదేహం మిస్సింగ్‌ కేసు విచారణలో భాగంగా నిందితుడి మేనమామ ఉసేన్ అలియాస్ యోహాను (35)ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో లాకప్‌లో ఉసేన్ అనుమానాస్పదంగా మరణించాడు. ఉసేన్ మృతదేహంపై గాయాలు ఉండటంతో పోలీసుల విచారణలోనే మరణించాడనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇది లాకప్‌ డెత్తా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. ఉసేన్ మృతిపై పోలీసులు మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం గమనార్హం.

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక మృతదేహం మిస్సింగ్‌ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 9వ తేదీ నుంచి కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరకడం లేదు. ఈ నెల 7వ తేదీన పార్క్‌లో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం చంపేసి మృతదేహాన్ని దొరక్కుండా చేశారు.

అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దీంతో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక మృతదేహాన్ని కేసీ కెనాల్‌ గుట్టపై నుంచి పడేసినట్లు మైనర్లు వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణా నదిలో పడేశామని చెప్పారు. వీరికి వారి తల్లిదండ్రులు కూడా సాయపడినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఈ నెల 16న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.



Next Story