రూ.30 లక్షల విలువైన ఆల్పాజోలం పట్టివేత

by Sridhar Babu |
రూ.30 లక్షల విలువైన ఆల్పాజోలం పట్టివేత
X

దిశ, నాగిరెడ్డిపేట్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 30 లక్షల రూపాయల విలువైన నిషేధిత ఆల్ఫా జోలంను నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా రవాణా అవుతున్న అక్రమ నిషేధిత ఆల్ఫాజోలం రవాణా సూత్రధారులను పట్టుకునేందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మండల కేంద్రంలో భారీగా ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో భాగంగా నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు వెంకటేష్, స్వప్న, ఎక్సైజ్ సిబ్బంది కలిసి శుక్రవారం రాత్రి వరకు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది.

ఈ ఆపరేషన్ లో నాగిరెడ్డిపేట మండలంలోని మాసానిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, గాంధారి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తుల నుండి 30 లక్షల రూపాయల విలువైన 35 కిలోల నిషేధిత ఆల్ఫా జోలం ను పట్టుకున్నట్లు తెలిసింది. ఈ నిషేధిత ఆల్ఫా జోలం రవాణా కేసులో ప్రధాన సూత్రధారి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, ఆల్ఫా జోలం పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story