నుదుటి మీద చిన్న గాయం..! మృతిపై అనుమానం..?

by Kavitha |
నుదుటి మీద చిన్న గాయం..! మృతిపై అనుమానం..?
X

దిశ, జవహర్ నగర్: రాత్రి మద్యం తాగి పడుకున్నాడు.. ఉదయం లేచేసరికి మేలుకో లేదు.. కానీ, నుదుటి మీద మాత్రం చిన్న గాయం కనిపించడంతో ఆ వ్యక్తి మృతిపై అనుమానం కలుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం..

నగరంలోని బోరబండలో మిడ్డేపల్లి రాజేందర్ (40), అతని స్నేహితుడు మండే మాణిక్యం(50) ఇద్దరు కలిసి బ్యాచిలర్లుగా కలిసి నివసిస్తున్నారు. రాజేందర్ బాలానగర్‌లోని ఓ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తూ, ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. బాలాజీ నగర్‌లో ఉండే ఓ వ్యక్తి నుంచి రూ. లక్షకు చెందిన వడ్డీ, మొత్తం వసూలు చేసేందుకు వీరిద్దరూ ఈ నెల 16న బోరబండ నుంచి సాయంత్రం గం.7:30 లకు బయలుదేరి రాత్రి గం.11:00లకు బాలాజీ నగర్ చేరుకున్నారు. సదరు వ్యక్తిని కలుసుకునే ముందు ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం తాగి, అదనంగా ఒక మద్యం సీసా కూడా తీసుకున్నారు. మార్గమధ్యంలో అనగా బాలాజీ నగర్ రాగానే వారి మోటారుసైకిల్‌ పంచర్ కావడం, మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో వారి వాహనం బాలాజీ నగర్ లోని సైకిల్ షాప్ వద్దే ఉంచారు.

తర్వాత ఇద్దరు నడుచుకుంటూ బాలాజీ నగర్ లోని శ్రీరాం నగర్ కాలనీలో డబ్బులిచ్చే వ్యక్తి ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా.. ఇంత నైట్ కూడా ఎందుకు వచ్చారని చెప్పగా ఇద్దరు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ఇద్దరు కలిసి వరసిద్ధి వినాయక ఆలయం ఎదుట రోడ్డు పక్కన కూర్చుని తమ వెంట తెచ్చుకున్న మద్యం సేవించడం వల్ల రాజేందర్(40) అక్కడ ఉన్న ఇనుప చట్రంపై పడిపోయాడు. ఆ తర్వాత, వారు రాత్రంతా అక్కడే నిద్రించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఉదయానికి మిడ్డేపల్లి రాజేందర్ లేవకపోయే సరికి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా మిడ్డేపల్లి రాజేందర్ మృతిచెందినట్టుగా, అతని శరీరంపై నుదుటి మీద చిన్న గాయం తప్ప, మరే ఇతర గాయాలు కనిపించలేదు. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌కు సమాచారం అందించారు. కాగా మృతుడి అన్నయ్య కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed