3.323 కిలోల గంజాయి పట్టివేత

by Sridhar Babu |
3.323 కిలోల గంజాయి పట్టివేత
X

దిశ, జగదేవ్ పూర్ : గంజాయిని తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో ఏఎంఆర్ కాలువ వద్ద జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగదేవ్ పూర్ ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు ఏఎంఆర్ కాలువ వద్ద రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా మండలం బాలాజీనగర్ కు చెందిన కోహెడ వెంకటేష్, సోడే జస్వంత్ అలియాస్ బన్నీ, సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమిరి ప్రేమ్, మామిడాల అరవింద్, జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోసానిపల్లి బాలకృష్ణ, చాట్లపల్లి గ్రామానికి చెందిన బింగి సంపత్, మునిగడప గ్రామానికి చెందిన పల్లెపాటి వెంకటేష్ జగదేవ్ పూర్ వైపు నుంచి చేర్యాల వైపు వెళ్తున్నారు. వీరిని ఆపే ప్రయత్నం చేయగా వారు తప్పించుకోడానికి ప్రయత్నించారు.

దీంతో పోలీసులు వారిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని విచారించగా వారి వద్ద 3.323 కిలోల గంజాయి బయటపడింది. అయితే సదరు నిందితులు గంజాయిని గత నెల 20వ తేదీన భద్రాచలం వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 15 వేల రూపాయలకు 5 కిలోల గంజాయి కొనుగోలు చేశామని చెప్పారు. ఎవరికీ అనుమానం కలుగకుండా పినపాక పట్టి నగర్ వద్ద ఫంక్షన్ హాల్ ముందు గల బజాజ్ పల్సర్ బైక్ ను దొంగతనం చేసి దానిపై బాలాజీ నగర్ లోని వారి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కొద్దిగా గంజాయి తాగుతూ దొంగిలించిన బైక్​ని వాడుకుంటున్నారు. అయితే గత 20 రోజుల క్రితం పరిచయం ఉన్న ప్రేమ రాజ్, అరవింద్ లకు 2 కిలోల గంజాయిని 24 వేల రూపాయలకు అమ్మారు.

అనంతరం బుధవారం ఫోన్ చేసి మల్లీ గంజాయి కావాలని అడగడంతో నిందితులు తమ వద్ద ఉన్న గంజాయిని తీసుకొని వెళ్తున్నారు. ఈ విషయంలో పోలీసులు వెంకటేష్, బన్ని లను తీసుకొని పోతిరెడ్డిపల్లి లోని ప్రేమ రాజ్ ఇంటికి మధ్యాహ్నం 2 గంటలకి వెళ్లగా అక్కడ ప్రేమ రాజ్, అరవింద్, బాలకిషన్ సంపత్, వెంకటేష్ లు గంజాయి తాగుతూ కనిపించారు. వెంటనే వారు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకొని విచారించగా గంజాయి తాగుతున్నట్లుగా ఒప్పుకున్నారు. గతంలో తన స్నేహితుడు తేజ నెంబర్ ప్లేట్ లేని హీరో హోండాను దొంగతనం చేసి తనకు ఇచ్చారని చెప్పారు. పోలీసులు బైక్ ని స్వాధీనం చేసుకొని ప్రేమ రాజ్ ఇంట్లో వెతకాగా కిలో గంజాయి లభించగా దాన్ని సీజ్ చేశారు.

కాగా బింగి సంపత్, వెంకటేష్ ల వద్ద నుండి గంజాయి కొనడానికి తెచ్చిన 2 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని ప్రేమ రాజ్, అరవింద్, వెంకటేష్ ల సెల్ ఫోన్ లు సీజ్ చేశారు. మొత్తం 3.323 కిలోల గంజాయి 6 సెల్ ఫోన్ లు, 2 వేల రూపాయల నగదు సీజ్ చేసి నిందితులని అదులోకి తీసుకొని రిమాండ్ కి పంపించారు. ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని హోటళ్లల్లో, కల్లు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర వహించిన జగదేవ్ పూర్ ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డ్ గురించి సిద్ధిపేట సీపీకి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story