నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. 24 మంది రోగులు మృతి

by Vinod kumar |
నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం.. 24 మంది రోగులు మృతి
X

ముంబై : మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందగా, వారిలో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన నవజాత శిశువుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరందరికి సకాలంలో చికిత్స, ఔషధాలు అందకపోవడం వల్లే మరణించారని తెలుస్తోంది. ఓవైపు ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరగగా.. మరోవైపు ఆస్పత్రి నుంచి ఎంతోమంది నర్సులను వెంటవెంటనే బదిలీ చేయడంతో రోగులకు సత్వర చికిత్స అందించలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

హాఫ్‌కిన్‌ ఇన్ స్టిట్యూట్ అనే ఫార్మా కంపెనీ నుంచి ఔషధాలను కొనాల్సి ఉండగా.. పెరిగిన ఆస్పత్రి అవసరాలకు అనుగుణంగా నిధులు అందుబాటులో లేకపోవడంతో మందులను కొనే పరిస్థితి లేకుండాపోయిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు తమకున్న కొద్దిపాటి బడ్జెట్‌తో కొన్ని మందులను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేయించి రోగులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఈ మరణాలు దురదృష్ణకరమని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు.

ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై మరింత సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే అని శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఈవెంటులు, విదేశీ పర్యటనలలో బిజీగా ఉందని, రాష్ట్రానికి సేవ చేసే ఆసక్తి సర్కారుకు లేదన్నారు. ఈ మరణాలకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ బాధ్యత వహించాలని శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైద్య సిబ్బంది కొరత, మందుల కొరత వల్లే ఈ మరణాలు సంభవించాయని మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed